మే 5న శ్రీనివాస సేతు ప్రారంభం.. అదేరోజు శ్రీవారి మెట్టు పునఃప్రారంభం..

మే 5న తిరుపతిలో శ్రీనివాస సేతు మొదటి దశలో పూర్తయిన పనులకు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈమేరకు టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. శ్రీనివాస సేతు రెండో దశ పనులకు 100 కోట్ల రూపాయలు కేటాయించామని.. వాటిని వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి చేస్తామని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మే 5న శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా పునఃప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఆమధ్య వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమైంది. మరమ్మతుల అనంతరం మే 5న ఆ మార్గాన్ని కూడా భక్తులకు అందుబాటులోకి తెస్తున్నారు.

ఘాట్ రోడ్ పటిష్టతకు చర్యలు..
ఇటీవల ఘాట్ రోడ్ లో తరచూ కొండచరియలు విరిగి పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఐఐటీ నిపుణుల సూచనల మేరకు ఘాట్ రోడ్డుకు మరమ్మతులు చేయడానికి టీటీడీ సిద్ధమైంది. ఘాట్ రోడ్డులో పటిష్ట చర్యలకు, నిపుణుల సూచనల మేరకు మార్పులు చేసేందుకు 36 కోట్ల రూపాయలు కేటాయించింది టీటీడీ. ఇక తిరుమలలో వసతి గదుల మరమ్మతులకు రూ.19 కోట్లు కేటాయించారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపుని కూడా త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించింది టీటీడీ పాలకమండలి. బాలాజీ నగర్‌లో 2.86 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్సులకోసం ప్రత్యేక బస్ స్టాండ్ నిర్మించబోతున్నారు.

శ్రీవారికి బంగారు సింహాసనాలు..
పాలకమండలి తీసుకున్న మరో కీలక నిర్ణయం టీటీడీ ఆస్థాన సిద్ధాంతిగా వేంకట కృష్ణ పూర్ణ సిద్ధాంతి నియామకం. ఇక తిరుమలలోని శ్రీవారి ఆలయంలో 3.61 కోట్ల రూపాయలతో బంగారు సింహాసనాలు తయారు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. పద్మావతి మెడికల్ కాలేజీలో రూ. 21 కోట్ల వ్యయంతో నూతన నిర్మాణాలు చేపట్టబోతున్నారు. దర్శనాల విషయానికొస్తే.. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులకు టోకెన్ల జారీని త్వరలోనే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.