సన్నాఫ్ ఇండియా మూవీ రివ్యూ

నటీనటులు : డా. మోహన్ బాబు, మీనా, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పోసాని కృష్ణమురళి, నరేష్, తనికెళ్ళ భరణి, అలీ, సునీల్, బండ్ల గణేష్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : మేస్ట్రో ఇళ‌య‌రాజా
కెమెరా : స‌ర్వేష్ మురారి
ఎడిటింగ్ : గౌతంరాజు
మాటలు : డైమండ్ ర‌త్న‌బాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్‌
నిర్మాణం : శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ
నిర్మాత‌: విష్ణు మంచు
క‌థ‌-ద‌ర్శ‌క‌త్వం: డైమండ్ ర‌త్న‌బాబు
స్క్రీన్‌ప్లే: డాక్ట‌ర్ ఎం. మోహ‌న్‌బాబు
నిడివి : 85 నిమిషాలు
రేటింగ్: 1.5/5

దర్శకులు తమ వాక్చాతుర్యంతో నిర్మాతల్ని ముగ్గులోకి దింపడం సర్వసాధారణం. తమ దగ్గరున్న కంటెంట్ తో నిర్మాతలతో డబ్బులు పెట్టించడం కూడా ఓ కళ. ఇలా మోసపోయిన నిర్మాతలు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అయితే 5 వందలకు పైగా సినిమాలు చేసి, ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన మోహన్ బాబు ఈ జాబితాలోకి చేరడమే బాధాకరం. అవును.. దర్శకుడు డైమండ్ రత్నబాబు ఏం చెప్పి ఒప్పించాడో కానీ, సన్నాఫ్ ఇండియా సినిమాతో మోహన్ బాబు బుక్కయిపోయారు.

ఏ జానర్ లో సినిమా తీస్తున్నామనే విషయాన్ని పక్కనపెడితే, అసలు తాము తీసే సినిమాకు టార్గెట్ ఆడియన్స్ ఎవరనే విషయాన్ని గుర్తించడం మినిమం కామన్ సెన్స్. ఆ ఇంగితజ్ఞానం కూడా కనిపించని సినిమా ఇది. ఓటీటీకి కాస్త ఎక్కువ, సిల్వర్ స్క్రీన్ కు ఎంతో తక్కువగా తీసిన సగటు నేలబారు సినిమా ఈ సన్నాఫ్ ఇండియా.

అన్నింటికీ మించి అతిపెద్ద డిసప్పాయింట్ ఏంటంటే.. సినిమాలో మోహన్ బాబుతో పాటు.. మీనా, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్ , పోసాని కృష్ణమురళి, నరేష్, తనికెళ్ళ భరణి, అలీ, సునీల్, బండ్ల గణేష్, వెన్నెల కిషోర్.. ఇలా చాలామంది ఆర్టిస్టులున్నారు. కాబట్టి కంటెంట్ ఎలా ఉన్నా, తెరనిండా తెలిసిన ఆర్టిస్టులున్నారు కాబట్టి సర్దుకోవచ్చని అనుకుంటాడు ప్రేక్షకుడు. కానీ ఆడియన్స్ ఆశను ఆదిలోనే తుంచి పడేశారు మోహన్ బాబు. సినిమా మొత్తం తను మాత్రమే కనిపిస్తానని, మిగతావాళ్లంతా క్లైమాక్స్ లో వస్తారని చెప్పి ఉసూరుమనిపించారు.

ఇక అక్కడ్నుంచి మోహన్ బాబు ఏకపాత్రాభినయం మొదలవుతుంది. వరుసపెట్టి సన్నివేశాలు వస్తుంటాయి, అదే ఊపులో టన్నుల కొద్దీ డైలాగులు పడుతుంటాయి. సన్నివేశం ఎందుకొస్తుందో అర్థంకాదు, ఆ సీన్ కు ఆ డైలాగ్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. మోహన్ బాబు డైలాగులు చెప్పుకుంటూ వెళ్తారు, సన్నివేశం కట్ అవుతుంది. మరో సీన్ మొదలౌతుంది, మళ్లీ డైలాగ్. సీన్ కట్. ఇలా గంటన్నర పాటు మోహన్ బాబు తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు.

ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ సాధారణ జీవితం గడిపే విరూపాక్ష (డా.మోహన్ బాబు) ఓ రాజకీయ నాయకుడి కారణంగా తన భార్య , కూతురుని కోల్పోతాడు. ఆ తర్వాత చేయని నేరానికి జైలుకి వెళ్తాడు. జైలర్ నరేష్ (నరేష్) సహాయంతో జైలు నుండి బయటికొచ్చి తన కుటుంబాన్ని చంపిన వారిపై రివేంజ్ తీర్చుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో సెంట్రల్ మినిస్టర్ మహేంద్ర భూపతి(శ్రీకాంత్), ని అలాగే డాక్టర్ ప్రతిభని , దేవాదాయ శాఖ మంత్రి (రాజా రవీంద్ర).. ఇలా చాలామందిని కిడ్నాప్ చేస్తాడు. వీటి కోసం తను ఓ ప్రైవేట్ జైలును సృష్టిస్తాడు. అందులో తన శిక్షలు అమలు చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా తన ప్రతీకారం తీర్చుకుంటాడు విరూపాక్ష.

ఇలాంటి రివెంజ్ డ్రామాలు చాలానే చూశాం. ఆసక్తికరంగా మలిస్తే ఈ జానర్ సినిమాల్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ మోహన్ బాబు, దర్శకుడు రత్నం ఈ కోణంలో ఏమాత్రం ఆలోచించినట్టు కనిపించలేదు. స్క్రీన్ ప్లేపై మోహన్ బాబు దృష్టిపెట్టలేదు, డైరక్షన్ పై రత్నబాబు దృష్టిపెట్టలేదు. ఇద్దరూ కలిసి కేవలం డైలాగులపై మాత్రమే దృష్టి పెట్టి తీసిన కళాఖండం ఇది. దీంతో నిడివి గంటన్నరే అయినప్పటికీ 3 గంటలు సినిమా చూసిన ఫీలింగ్.

తన కెరీర్ లో ఎన్నో హిట్ డైలాగ్స్ చెప్పారు మోహన్ బాబు. తనకంటూ ఓ డైలాగ్ మాడ్యులేషన్ ఉంది. ఓ ఇమేజ్ ఉంది. కానీ సన్నాఫ్ ఇండియాలో ఒక్క డైలాగ్ కూడా పేలలేదు. ఓ సీన్ ప్రారంభించి, ఇంకేదో డైలాగ్ అతికించి, ఇంకెక్కడో ముగించడం ఈ సినిమాలోనే చూస్తాం. కనీసం ఏ డైలాగ్ పేలుతుందో కూడా అంచనా వేయలేకపోవడం, మోహన్ బాబు సీనియారిటీపై అనుమానాలు రేకెత్తిస్తుంది. దీనికితోడు లాజిక్ లేని స్క్రీన్ ప్లే సినిమాపై ఆసక్తిని చంపేసింది.

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఈ ఏకపాత్రాభినయం సినిమాలో మోహన్ బాబు గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఆయన నటన, డైలాగ్ డెలివరీ ఎప్పట్లానే చాలా బాగున్నాయి. వయసు పెరిగినా తనలో నటనాపటిమ తగ్గలేదని, డైలాగ్ చెప్పే విధానం మారలేదని మోహన్ బాబు మరోసారి నిరూపించుకున్నారు. సినిమా చివర్లో వచ్చే ఇతర నటీనటులంతా సింగిల్ కాల్షీట్లో ఇలా వచ్చి అలా నటించి వెళ్లిపోయారు. సింగిల్ సీన్ లో కనిపించిన వాళ్ల పెర్ఫార్మెన్సుల గురించి చెప్పుకోడానికేం లేదు.

కథ, స్క్రీన్ ప్లే లేని ఈ సినిమాను టెక్నికల్ గా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఇళయరాజా శ్రమ వృధా అవ్వగా, ఎడిటర్ గౌతం రాజు, సినిమాటోగ్రాఫర్ సర్వేష్ మురారి పూర్తిగా చేతులెత్తేశారు. డైమండ్ రత్నబాబు కథ-దర్శకత్వం మరీ లో-లెవెల్లో ఉన్నాయి.

ఓవరాల్ గా సన్నాఫ్ ఇండియా సినిమా మోహన్ బాబు స్థాయి, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాయికి తగ్గ సినిమా కాదు. కలెక్షన్ కింగ్ కు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు అందించదు. కనీసం మోహన్ బాబు డైలాగ్స్ తోనైనా తృప్తి పడదామంటే, మనకు ఆ అవకాశం ఇవ్వడు సన్నాఫ్ ఇండియా.