ఖిలాడీ మూవీ రివ్యూ

నటీనటులు: రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్ హ‌యాతి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, అనసూయ తదితరులు
కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌: రమేష్‌ వర్మ
ప్రొడ్యూసర్‌: కోనేరు సత్యానారాయణ
బ్యానర్స్‌: ఏ స్టూడియోస్, పెన్‌ స్టూడియోస్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: సుజిత్‌ వాసుదేవ్, జీకే విష్ణు
నిడివి: 2 గంటల 34 నిమిషాలు
సెన్సార్: యు/ఏ
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 11, 2022
రేటింగ్: 2/5

క్రాక్ సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ఖిలాడీ సినిమాపై అంచనాలు పెరిగాయి తప్ప, రవితేజ సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టేసి చాన్నాళ్లయింది. ఒకే గెటప్, ఒకే స్టోరీ, మూస యాక్షన్, రొటీన్ రివెంజ్ డ్రామాలు చూసి విసుగెత్తిపోయారు జనం. క్రాక్ హిట్టవ్వడంతో, ఖిలాడీ కూడా కాస్త కొత్తగా, మరింత ఎంగేజింగ్ గా ఉంటుందని ఆడియన్స్ భ్రమపడ్డారు. కానీ ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఖిలాడీ సినిమా, రవితేజ మైండ్ సెట్ అస్సలు మారలేదని మరోసారి రుజువు చేసింది.

ఇందులో హీరో ఓ పెద్ద దొంగతనం చేస్తాడు. ఇటలీ నుంచి వచ్చిన 10వేల కోట్ల రూపాయల డబ్బును కొట్టేస్తాడు. ఆ డబ్బు హోం మినిస్టర్ కు చెందింది. దాంతో అతడు రాజకీయంగా ఎదగాలని చూస్తాడు. ఏకంగా సీఎంను దించేసి, తను ఆ కుర్చీలో కూర్చోవాలని చూస్తాడు. కానీ హీరో ఆ డబ్బుతో ఉన్న కంటైనర్ ను కొట్టేస్తాడు. దాన్ని కనిబెట్టేందుకు పోలీసులు, సీబీఐ ఆఫీసర్ అర్జున్ విశ్వప్రయత్నం చేస్తారు. కానీ హీరో మాత్రం దొరకడు, కంటైనర్ కూడా దొరకదు. ఇంతకీ హీరో ఎందుకు ఆ కంటైనర్ ను కొట్టేస్తాడు? ఆ డబ్బు ఏం చేశాడు? హీరో జైలుకు ఎందుకు వెళ్తాడు? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

ఇలా 4 ముక్కల్లో చెప్పుకున్నప్పుడే సినిమాలో కథ ఏంటి, క్లైమాక్స్ ఏంటనేది సగటు ప్రేక్షకుడు ఊహించుకోవచ్చు. అందుకేనేమో దర్శకుడు కాస్త తెలివిగా ఆలోచించి, సెకండాఫ్ మొత్తం ట్విస్టులతో నింపేశాడు. చివరికి క్లైమాక్స్ లో కూడా వరుసపెట్టి ట్విస్టులు ఇచ్చాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ కథ ఎంత పేలవంగా ఉందో, ఆ ట్విస్టులు అంతే నీరసంగా ఉన్నాయి. ఫలితంగా ఖిలాడీ కుంగికృశించిపోయాడు.

సినిమాను స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేశాడు దర్శకుడు రమేష్ వర్మ. మంచి సన్నివేశాలు పేర్చాడు. హీరోహీరోయిన్ల మధ్య మంచి రొమాంటిక్ ట్రాక్ పెట్టాడు, మంచి సాంగ్స్ పెట్టాడు. ఇంటర్వెల్ కు ముందు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. దీన్ని ఇలానే కొనసాగిస్తే బాగుండేది. ఇంకా ఎక్కువ మసాలా దట్టించాలనే ఉద్దేశంతో సెకెండాఫ్ నుంచి ట్విస్టులు ఇవ్వడం మొదలుపెట్టాడు దర్శకుడు. అవన్నీ వికటించాయి. సినిమాను వీక్ చేసి పడేశాయి. ఫలితంగా ఖిలాడీ బిలో యావరేజ్ అనిపించుకోవాల్సి వచ్చింది.

ఉన్నంతలో ఈ సినిమాను ఆదుకునే ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఓ మూడు. హీరోయిన్స్ అందాలు, రెండు యాక్షన్ సన్నివేశాలు. వీటి కోసం ఖిలాడీ సినిమాను ఓసారి చూడొచ్చు.

నటీనటుల విషయానికొస్తే, రవితేజ క్యారెక్టర్ లో, మేనరిజమ్స్ లో, యాక్టింగ్ లో కొత్తదనం లేదు. గతంలో పదుల సంఖ్యలో ఇలాంటి సినిమాలు చేశాడనిపిస్తుంది. అది నిజం కూడా. హీరోయిన్లు డింపుల్ హయాతి, మీనాక్షి దీక్షిత్ తమ అందాలతో స్క్రీన్ పై సెగలు పుట్టించారు. డింపుల్ అయితే మరో అడుగు ముందుకేసి స్కిన్ షో పండించింది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు ఎస్సెట్ అయ్యాడు. ఇద్దరు సినిమాటోగ్రాఫర్లను పెట్టుకున్నప్పటికీ ఆ మేజిక్ సినిమాలో కనిపించలేదు. ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది. డైలాగ్స్ లో మెరుపులు 2-3 చోట్ల మాత్రమే కనిపించాయి. కొన్ని సన్నివేశాలకు డీఐ వర్క్ కూడా చేసినట్టు అనిపించలేదు. చాలా లో-గ్రేడ్ లో ఉన్నాయి.

ఓవరాల్ గా చూసుకుంటే.. ఖిలాడీ సినిమా ఇంతకుముందు రవితేజ నటించిన ఎన్నో సినిమాల్ని గుర్తుకుతెస్తుంది. మచ్చుకు కూడా కొత్తదనం కనిపించని ఈ సినిమాను కేవలం హీరోయిన్ల అందాల కోసం, 2 యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మాత్రమే చూడొచ్చు.