బంగార్రాజులో బ్రహ్మానందం మిస్

బంగార్రాజు సినిమా రిలీజై చాలా రోజులైంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఆ సినిమాపై చాలా చర్చ నడిచింది. ఇప్పుడు కొత్తగా మరో చర్చ ఊపందుకుంది. బంగార్రాజు సినిమాలో బ్రహ్మానందం ఎందుకు లేడు అనేది తాజా చర్చ. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బ్రహ్మానందం ఉన్నారు. ఆయన పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కథను మలుపుతిప్పే పాత్ర అవ్వడంతో పాటు, కామెడీ కూడా పండించడంతో అంతా ఎంజాయ్ చేశారు.

అంతటి కీలకమైన పాత్ర బంగార్రాజులో మిస్ అయింది. పైగా సినిమాలో కామెడీ డోస్ తగ్గిన నేపథ్యంలో, బ్రహ్మానందం ఉంటే బాగుండేదనే చర్చ మొదలైంది. దీనిపై నాగార్జున రెస్పాండ్ అయ్యారు. కథ ప్రకారం బ్రహ్మానందంను పెట్టలేకపోయినట్టు వివరణ ఇచ్చుకున్నాడు నాగార్జున.

బంగార్రాజు సినిమాలో నాగచైతన్యను మనవడిగా చూపించారు. అంటే.. దాదాపు 30 ఏళ్ల గ్యాప్ అన్నమాట. కథలో అంత గ్యాప్ ఇస్తూ సినిమా తీసినప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ అయిన బ్రహ్మానందంను చూపించడం కుదరదంటున్నాడు నాగ్. ఒకవేళ చూపించాల్సి వస్తే, బ్రహ్మానందంను 85 ఏళ్ల వృద్ధుడిగా చూపించాలని, అంత అవసరం లేదని క్లారిటీ ఇచ్చాడు.