ఏపీలో కొత్త జిల్లాలపై ప్రకటన.. రెండ్రోజుల్లో జీవో విడుదల..

ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకి సుముఖంగా ఉంది. గతంలోనే దీనికి సంబంధించిన కసరత్తు జరిగింది. లోక్ సభ నియోజకవర్గాల సరిహద్దుల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటనలు కూడా వచ్చాయి. అప్పట్లో అదిగో ప్రకటన, ఇదిగో జీవో అన్నారు కానీ రెండున్నరేళ్లుగా ఆ ఊసు లేదు. మళ్లీ ఇప్పుడు కొత్త జిల్లాల జీవో తెరపైకి వచ్చింది. సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకి తుది ఆమోదం ఇచ్చేశారని ఇక జీవో విడుదలే తరువాయి అంటున్నాయి అధికార వర్గాలు.

ఎందుకీ విభజన..
కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత సులభం అవుతుందనేది ప్రభుత్వం వాదన. ఇప్పటికే సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకు పాలన అనేది పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది. జిల్లా కేంద్రాలు కూడా దగ్గరగా ఉంటే అధికారుల తనిఖీలు, సమీక్షలు.. అన్నీ సులభం అవుతాయి. తక్కువ పరిధిపై ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం కూడా మెరుగవుతుంది. అందుకే జిల్లాల పరిధిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, ఇప్పుడిక ఏపీ వంతు.

19, 25 మధ్య తర్జన భర్జన..
లోక్ సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన జరిగితే నెంబర్ 25 అని ఫిక్స్ అయిపోవచ్చు. కానీ కొన్నిచోట్ల లోక్ సభ నియోజకవర్గ కేంద్రాలు మారుమూల ప్రాంతాలకు సుదూరంగా మారే అవకాశం ఉంది. అలాంటి చోట్ల జిల్లాల రూపు రేఖల్ని, భౌగోళికంగా, జనాభా పరంగా సమ ప్రాధాన్యం ఇస్తూ విభజించే ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించి 19 జిల్లాల లిస్ట్ కూడా రెడీగా ఉంది. అయితే ఈ రెండిటిలో దేనికి సీఎం జగన్ ఓకే చెప్పారు. జీవోలో ఎన్ని కొత్త జిల్లాల పేర్లు ఉన్నాయనేది తేలాల్సి ఉంది.