మేజర్ సినిమా కూడా వాయిదా

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ను ఫిబ్రవరి 11న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కార‌ణంగా మేజ‌ర్‌ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దేశంలో పలు చోట్ల కర్ఫ్యూలు, కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్‌ చేయడం లేద‌ని ప్రకటించారు.

‘దేశంలో ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కొన్ని చోట్ల కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే మరో విడుద‌ల‌ తేదీని ప్రకటిస్తాం. అందరూ కరోనా నిబంధనలు పాటించండి.. క్షేమంగా ఉండండి. మనలో ప్రతీ ఒక్కరూ క్షేమంగా ఉంటేనే దేశం కూడా సురక్షితంగా ఉంటుంది’ అని తెలిపారు.

శశి కిరణ్ తిక్క దర్వకత్వం వ‌హిస్తున్న‌ ఈ మూవీ ఒకే సారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మల‌యాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ హృదయమా అనే పాటతో మొదలుపెట్టారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మేజర్ సందీప్ బాల్యాన్ని, యవ్వనాన్ని చూపించనున్నారు. ముంబై దాడుల్లో మేజర్ వీర మరణం వంటి సన్నివేశాలన్నీ ఇందులో చూపించబోతోన్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.