ట్రాఫిక్ పోలీసులు మెచ్చిన అఖండ

తమకు పనికొచ్చే ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టదు ట్రాఫిక్ పోలీస్ ఐటీ విభాగం. ఇప్పటికే మహేష్ బాబును ట్రాఫిక్ నిబంధనల కోసం వాడేసిన ఈ ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు అఖండ సినిమాపై ఫోకస్ పెట్టారు. సీట్ బెల్ట్ పెట్టుకోమనే సందేశాన్నిచ్చిన బాలయ్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

అఖండ సినిమాలో బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ఓపెన్ టాప్ జీపులో ప్రయాణించే సీన్ ఉంది. అందులో సడెన్ గా బ్రేక్ వేస్తాడు బాలయ్య. ఆయన అప్పటికే సీటు బెల్ట్ పెట్టుకున్నాడు కాబట్టి ఏం కాదు. కానీ పక్కనే ఉన్న ప్రగ్యాజైశ్వాల్ మాత్రం భయపడుతుంది. ముందుకు తల కొట్టుకోబోతుంటే, బాలయ్య తన చేతిలో ఆపుతాడు. సీటు బెల్ట్ పెట్టుకోండి అని సున్నితంగా చెబుతాడు.

ప్రమాదాలు జరిగినప్పుడు సీటు బెల్ట్ ఎంత అత్యావశ్యకమో తెలియజేసే ఈ సీన్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఐటీ విభాగం షేర్ చేసింది. సీటు బెల్ట్ ఆవశ్యకతను చాటిచెప్పిన బాలయ్యకు, అఖండ యూనిట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. పనిలోపనిగా ఆ వీడియో క్లిప్ ను ట్రాఫిక్ నిబంధనల అవగాహన కోసం వాడేసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.