కేరళ బర్డ్ అట్లాస్.. ఇదో వింత, ఇదో అద్భుతం..

అట్లాస్ అంటే అందులో ప్రపంచ దేశాల భౌగోళిక సమాచారం, సరిహద్దులు.. ఖండాల వివరాలు అన్నీ ఉంటాయి. సహజంగా అట్లాస్ అంటే భౌగోళిక సమాచారం తెలిపే పుస్తకమే అందరికీ గుర్తొస్తుంది. కానీ కేరళలో మాత్రం ఓ వినూత్న ప్రయోగం జరిగింది. కేరళ బర్డ్ అట్లాస్ (KBA) పేరుతో ఓ కొత్త పుస్తకాన్ని రూపొందించారు. కేరళ అటవీ శాఖ, వ్యవసాయ యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. 2015 నుంచి 2020 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పక్షుల సమాచారాన్ని సేకరించి ఈ పుస్తకంలో పొందు పరిచారు.

ప్రతి ఏడాదీ 60రోజులపాటు సమగ్రంగా ఈ ప్రాజెక్ట్ పై అధ్యయనం జరిగింది, వలంటీర్లతో సమాచార సేకరణ నిర్వహించారు. 361 రకాల పక్షుల గురించి 3లక్షల రికార్డులను వారు తయారు చేశారు. వీటిలో 94 అత్యంత అరుదైన పక్షుల సమాచారం కూడా ఉందంటున్నారు. కేరళ రాష్ట్రాన్ని 4వేల చిన్న చిన్న గ్రిడ్ లు గా విభజించి, ఎక్కడెక్కడ ఎలాంటి పక్షులు ఉంటాయి, వాటి వివరాలు, జీవన విధానం.. వంటి విషయాలన్నిటినీ కూలంకషంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

వాస్తవానికి వర్షాకాలంలో పక్షుల సంతతి పెరుగుతుందనే అంచనాలుంటాయి. వర్షాలు పడితే కీటకాలు ఎక్కువగా దొరకడం, ఇతరత్రా పంటలతో భూమి పచ్చగా ఉన్నప్పుడు పక్షులు ఎక్కువగా ఉంటాయని అనుకుంటారంతా. కానీ వాతావరణం పొడిగా ఉండటమే పక్షులకు అనువైన కాలం అని ఈ అధ్యయనంలో తేలింది. ఆసియాలోనే పక్షులకు సంబంధించి ఇది అతి పెద్ద అధ్యయనంగా మిగిలిపోతుంది. 25వేల చెక్ లిస్ట్ లను ఇందులో పొందుపరిచారు. జీపీఎస్ అప్లికేషన్లు, లోకస్ ఫ్రీ వంటి ఉపకరణాల తో ఈ ప్రాజెక్ట్ అధ్యయనం పూర్తయింది. అయితే ఇందులో తక్కువ కాలం కేరళకు వలస వచ్చి వెళ్లిపోయే పక్షులను మాత్రం వీరు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. మొత్తమ్మీద బర్డ్ అట్లాస్ పేరుతో కేరళ చేసిన వినూత్న ప్రయోగం.. మిగతా రాష్ట్రాలకు మార్గదర్శి కాబోతోంది.