ఐటెంసాంగ్ కు క్లాసికల్ టచ్

ఈమధ్య ఐటెంసాంగ్స్ లో కూడా వేదాంతం ఒలకబోస్తున్నారు. బీట్ మాస్ గా సాగినప్పటికీ, సాహిత్యంలో తాత్వికత జోడించడం ఇప్పుడు ట్రెండ్ అయింది. ఇప్పుడీ ట్రెండ్ ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లింది మరో ఐటెంసాంగ్. టెన్త్ క్లాస్ డైరీస్ అనే చిన్న సినిమా వస్తోంది. దీనికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.

సినిమా నుంచి తొలి లిరికల్ వీడియోగా ఐటెంసాంగ్ ను రిలీజ్ చేశారు. పేరుకు ఇది ఐటెంసాంగ్ అయినప్పటికీ.. అక్కడక్కడ క్లాసికల్ టచ్ ఇచ్చాడు సంగీత దర్శకుడు. ఐటెంసాంగ్స్ లో ఇదో ప్రయోగమనే చెప్పాలి. తెరపై ఐటెంభామలు కనిపిస్తున్నప్పటికీ, వెనక ఇలా క్లాసికల్ సంగీతం అక్కడక్కడ వినిపించడం కొత్తగా ఉంది. ఇదే కొత్తదనం అనుకుంటే, ఈ క్లాసికల్ సంగీతానికి ఐటెం మాస్ స్టెప్పులు వేయడం మరో కొత్తదనం.

శ్రీరామ్, అవికా గౌర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోంది టెన్త్ క్లాస్ డైరీస్. అచ్యుత రామరావు, రవితేజ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల రామారావు, అర్చన, శ్రీనివాసరెడ్డి, సత్యంరాజేష్, హిమజ, శివబాలాజీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. రిపబ్లిక్ డే రోజున సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు.