గోరఖ్ పూర్ సీఎంలకు కలసి రాదు.. యోగీకి నెగెటివ్ సెంటిమెంట్..

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచారు. ఆయన గతంలో ఎంపీగా పనిచేశారు, సీఎంగా ఎంపికైన తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతే కానీ నేరుగా అసెంబ్లీ బరిలో పోటీకి దిగలేదు. ఇప్పుడు అనివార్యంగా గోరఖ్ పూర్ అర్బన్ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే అదే స్థానం నుంచి గతంలో ఓ ముఖ్యమంత్రి పోటీ చేసి ఓడిపోయారు. పదవిలో ఉండగానే ఆయన గోరఖ్ పూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు, చివరకు సీఎం పీఠం వదిలారు. దీంతో ఇప్పుడా నెగెటివ్ సెంటిమెంట్ యోగీని వెంటాడుతోంది.

ప్రస్తుతానికి యోగీ యూపీ శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది జులై వరకు ఉంది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు యోగీ కూడా అసెంబ్లీ బరిలో నిలిచారు. మధుర లేదా, అయోధ్య వంటి సురక్షిత నియోజకవర్గాలను ఆయన ఎంపిక చేసుకుంటారని అనుకున్నారంతా, అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. కానీ చివరి నిముషంలో సమీకరణాలు మారిపోయాయి. యోగీని గోరఖ్ పూర్ అర్బన్ అభ్యర్థిగా ప్రకటించారు. గోరఖ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం యోగీకి బాగా అచ్చొచ్చిన స్థానం. వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచి తన హవా చూపించారాయన. అయితే ఇప్పుడది అంత సేఫ్ ప్లేస్ కాదు. పూర్వాంచల్ ప్రాంతంలో ఉన్న గోరఖ్ పూర్ పరిధిలోని కీలక నేతలంతా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. దీంతో గోరఖ్ పూర్ లో బీజేపీ పట్టు కోల్పోయింది, ఇప్పుడా స్థానం నుంచి యోగీ పోటీ చేస్తున్నారనగానే వైరి వర్గాలు కూడా అక్కడ ఎక్కువ దృష్టి కేంద్రీకరించే అవకాశముంది.

నెగెటివ్ సెంటిమెంట్ కూడా..
1969లో కాంగ్రెస్ విభజన నేప‌థ్యంలో కాంగ్రెస్ (ఓ) నాయకుడు త్రిభువన్ నారాయణ్ సింగ్ 1970 అక్టోబర్‌ లో అనూహ్యంగా యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యే సమయానికి ఆయ‌నకి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కానీ, కౌన్సిల్ లో కానీ సభ్యత్వం లేదు. దీంతో అప్పటికి ఖాళీగా ఉన్న గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సీఎంగా ఉండి కూడా ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్(ఐ) అభ్యర్థి గెలిచారు. దీంతో వెంటనే నారాయణ్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సిట్టింగ్ సీఎం ఓడిపోయిన ఉదాహరణ అది. ఇప్పుడు అదే స్థానం నుంచి యోగీ పోటీ చేస్తున్నారు. మరి యోగీకి కూడా అదే నెగెటివ్ సెంటిమెంట్ వర్తిస్తుందా..? అసలే గోరఖ్ పూర్ లో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఈ దశలో అక్కడ పోటీకి దిగి సాహసం చేస్తున్న యోగీ ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.