రవితేజ తల్లిపై పోలీస్ కేసు

ఊహించని విధంగా హీరో రవితేజ తల్లి పేరు వార్తల్లోకెక్కింది. మాస్ రాజా తల్లి భూపతి రాజ్యలక్ష్మిపై పోలీస్ కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద జరుగుతున్న కాలువ పనుల్ని భూపతి రాజ్యలక్ష్మి ధ్వంసం చేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ మేరకు రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తిపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం నేరం అనే కోణంలో వీళ్లపై కేసు నమోదైంది.

తమ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వీళ్లిద్దరూ ఈ పని చేయడమే కేసు నమోదవ్వడానికి కారణం అంటున్నారు అధికారులు. జరిగిన ఘటనపై ఇంతకుమించి బయటకు పెద్దగా సమాచారం రాలేదు. రవితేజ కూడా దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు.

అసలు రాజ్యలక్ష్మి హైదరాబాద్ లో రవితేజతో పాటు ఉంటారా లేక తూర్పుగోదావరి జిల్లాలో ఉంటారా అనే విషయంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. కేవలం ఈ పని కోసమే ఆమె హైదరాబాద్ నుంచి జగ్గంపేట వెళ్లారని మరికొందరు ఊహాగానాలు పుట్టిస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఖిలాడీ సినిమాను రిలీజ్ కు రెడీ చేసిన మాస్ రాజా, మరో 2 సినిమాల్ని శరవేగంగా పూర్తిచేసే పనిలో ఉన్నారు.