రిపబ్లిక్ డే శకటాల గోల.. ఎన్నికల రాష్ట్రాలపై అంత ప్రేమ ఏల..?

భారత గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించే శకటాలపై కేంద్రం వివక్ష చూపెడుతోందంటో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆందోళనబాట పట్టాయి. ఈసారి 15 రాష్ట్రాలకు చెందిన శకటాలకు కేంద్రం అనుమతివ్వకపోవడంతో.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, తమిళనాడు సీఎంలు.. కేంద్రం వివక్షతో వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. దీంతో కేంద్రం కూడా దీనిపై వివరణ ఇచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వానికి, గణతంత్ర శకటాల ఎంపికకు సంబంధం లేదని, పూర్తిగా వేడుకలకు సంబంధించిన కమిటీయే ఆ ప్రక్రియ పూర్తి చేస్తోందని చెప్పింది. కానీ ఈ గొడవ ఇక్కడితో ఆగేలా లేదు.

ఎన్నికల రాష్ట్రాలపై అంత ప్రేమ ఎందుకు..?
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ఏడాదిలో హడావిడిగా ఆయా రాష్ట్రాల్లో వేలకోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎక్కడలేని ప్రేమ చూపెడుతున్న కేంద్రం, గణతంత్ర దినోత్సవాల శకటాల ఎంపికలో కూడా వాటికి ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగింటికి పరేడ్ లో భాగస్వామ్యం దక్కడం విశేషం.

రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ఈసారి మొత్తం 56 ప్రతిపాదనలు రాగా, అందులో 21 నమూనాలను కమిటీ ఎంపిక చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, హర్యానా, ఛత్తీస్‌ గఢ్‌, గుజరాత్, గోవా, జమ్ముకాశ్మీర్‌, కర్నాటక, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాల శకటాలతోపాటు.. కేంద్రానికి చెందిన విద్య-నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయాన, సమాచార-తపాలా, హోం శాఖ, జలశక్తి, సాంస్కృతిక శాఖ.. ఇలా 9 కేంద్ర ప్రభుత్వ శాఖలు శకటాలు అనుమతి పొందిన జాబితాలో ఉన్నాయి. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక మినహా మిగిలిన ఏ రాష్ట్రానికి కూడా అనుమతి లేకపోవడం గమనార్హం.

గణతంత్ర వేడుకల్లో రాష్ర్టాల శకటాలను తిరస్కరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125 జయంతి సందర్భంగా ఆయన నెలకొల్పిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని గుర్తుచేస్తూ పశ్చిమ బెంగాల్ రూపొందించిన శకటాన్ని కేంద్రం తిరస్కరించింది. కేంద్రం నిర్ణయంతో బెంగాల్‌ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సీఎం మమతా బెనర్జీ ప్రధానికి లేఖ రాశారు. కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా ఇదే విషయంపై లేఖలు రాయగా.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వాటిపై స్పందించారు. వివక్ష లేదని, మార్గదర్శకాల ప్రకారమే ఆ ఎంపిక జరిగిందని, అందులో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాధికారం ఏదీ లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఏ ఒక్క రాష్ట్రానికి చెందిన శకటానికి కూడా అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పారు.

పరిమితంగా..
కరోనా దృష్ట్యా రిపబ్లిక్‌ వేడుకలకు 5వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు పరేడ్ ప్రారంభం అవుతుంది. కేంద్ర నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో గణతంత్ర వేడుకలు పూర్తయ్యే వరకు ఢిల్లీలో మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీ), పారాగ్లెడర్లు, హాట్‌ ఎయిర్‌ బెలూన్లు, డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధం విధించారు.