నేటినుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా..

ఏపీలో నేటినుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తోంది. రాత్రి 11 తర్వాత జనసంచారం లేకుండా చేసేందుకు కర్ఫ్యూ విధించారు. తెల్లవారు ఝామున 5 గంటల వరకు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తారు. ఈరోజుతో మొదలయ్యే కర్ఫ్యూ ఈనెల 31వ తేదీ వరకు అమలులో ఉంటుందని ప్రకటించారు అధికారులు.

మాస్క్ లేకపోతే వెయ్యి జరిమానా..
నైట్ కర్ఫ్యూ అమలులోకి వస్తున్న నేపథ్యంలో.. జరిమానాలు కూడా కచ్చితంగా వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. మాస్క్ లేకపోతే రూ.1000 జ‌రిమానా విధించాల‌ని నిర్ణ‌యించింది. శుభ‌కార్యాలు, మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల కోసం బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గ‌రిష్టంగా 200 మంది, ఫంక్షన్ హాల్స్ లో అయితే 100 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంది. కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యేవారు త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ఆదేశించింది. సినిమా హాళ్ల‌లో 50 శాతం సీటింగ్‌ కు మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ప్ర‌జా ర‌వాణా వాహనాల్లో ప్ర‌యాణం చేసేవారు త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని ఆదేశించింది. సినిమా హాళ్లలో సీటు మార్చి సీటు నిబంధన పెట్టారు కానీ, బస్సుల్లో మాత్రం ఆ నిబంధన ప్రస్తుతానికి లేదు.

వ్యాపార, వాణిజ్య స‌ముదాయాల్లో సిబ్బందితో పాటు అక్క‌డి వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల‌ను కూడా మాస్క్ పెట్టుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. వ్యాపార సముదాయాల్లో ఎవరైనా మాస్క్ నిబంధన పాటించకపోతే.. నిర్వాహకులకు రూ.10 వేల నుంచి 25 వేల రూపాయల వరకు భారీగా జరిమానా విధిస్తామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. దేవాల‌యాలు, ప్రార్థ‌నా మందిరాల్లో త‌ప్ప‌ని స‌రిగా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది.

వీరికి మినహాయింపు..
మీడియా, టెలికమ్యూనికేష‌న్స్‌, ఫార్మా, మెడిక‌ల్‌, పెట్రోల్‌, నీటి స‌ర‌ఫ‌రా, విద్యుత్ వంటి విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు నైట్ క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. అయితే కర్ఫ్యూ సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే ఆయా విభాగాల్లో పనిచేసే సిబ్బంది త‌ప్ప‌ని స‌రిగా గుర్తింపు కార్డ్ ద‌గ్గ‌ర ఉంచుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది.