శివ కార్తికేయన్ హీరో.. కమల్ హాసన్ నిర్మాత

`రెమో, వ‌రుణ్ డాక్ట‌ర్` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొంద‌బోతోంది. తెలుగు, త‌మిళ‌ భాష‌ల్లో రూపొంద‌నున్న ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ భాగ‌స్వామ్యం కావ‌డం విశేషం. ఈ విష‌యాన్ని తెలుగువారి పండుగైన క‌నుమ రోజు, ఈరోజు అధికారికంగా తెలియ‌జేశారు.

ప్ర‌ముఖ సంస్థ సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా తమిళ సినిమాల్లోకి భారీస్థాయిలో అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌.కె.ఎఫ్‌.ఐ.)తో నిర్మాణంలో పాలుపంచుకుంది. ఇంకా పేరుపెట్టని ఈ తమిళ చిత్రంలో శివకార్తికేయన్ నటించనున్నాడు. రాజ్‌కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించనున్నారు.

సోనీ పిక్చర్స్ సంస్థ 2019లో కోలీవుడ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో మలయాళ చిత్రం ‘నైన్’ నిర్మించింది. తెలుగులో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో క‌లిసి ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

ఈ సినిమా ఆర్‌.కె.ఎఫ్‌.ఐ. నిర్మాణంలో 51 వ చిత్రం కావ‌డం విశేషం. ఇటీవ‌లే 50వ చితంగా కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటించిన ‘విక్రమ్’ చిత్రాన్ని నిర్మించారు. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2022 వేసవిలో విడుదల కానుంది.