షాకింగ్.. అడ్వాన్స్ బుకింగ్ అంతంతమాత్రం

ఈ సంక్రాంతికి చాలా సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. రేపు బంగార్రాజుతో పాటు రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. మరో రోజు గ్యాప్ లో హీరో అనే సినిమా కూడా వస్తోంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తుతారని అంతా అనుకున్నారు. మరీ ముఖ్యంగా బంగార్రాజు మినహా మరో సినిమా లేకపోవడంతో.. అంతా తమ సినిమా చూస్తారని ట్రేడ్ భావించింది. కానీ అడ్వాన్స్ బుకింగ్ చూస్తే ఏమంత ఆశాజనకంగా లేదు.

బంగార్రాజుకు సంబంధించి 3 రోజుల కిందటే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. కానీ నైజాంలో ఇంకా టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి. చాలా థియేటర్లలో ఉదయం 9 గంటల ఆటకే టికెట్లు ఫ్రీగా దొరుకుతున్నాయి. ఇక ఏపీలో బుకింగ్స్ ఉన్నంతలో బాగున్నప్పటికీ.. సీడెడ్ లో మాత్రం డల్ గా ఉంది.

రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ అయితే దారుణమనే చెప్పాలి. భారీగా ప్రచారం చేస్తున్నప్పటికీ రౌడీ బాయ్స్ కు అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. కొన్ని స్క్రీన్స్ అయితే బోణీ కూడా కొట్టలేదు. ఇక సూపర్ మచ్చి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ సినిమాకు రేపు మార్నింగ్ షోలు రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఎల్లుండి థియేటర్లలోకి రాబోతున్న హీరో సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. కొత్త హీరో కావడం, స్టార్ దర్శకుడి సినిమా కాకపోవడంతో బజ్ అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ క్లిక్ అవ్వాల్సిందే.