సంక్రాంతి బరిలో యాంగ్రీ స్టార్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇప్పుడీ సినిమాను సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు.

రాజశేఖర్ కెరీర్ లోనే డిఫరెంట్ మూవీగా నిలవనుంది శేఖర్. పేరుకు ఇది రీమేక్ ప్రాజెక్టు అయినప్పటికీ, రాజశేఖర్ ఇమేజ్, తెలుగు నేటివిటీని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేశారు జీవిత రాజశేఖర్. రాజశేఖర్-జీవిత కాంబోలో చాన్నాళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. శేఖర్ పై భారీ అంచనాలున్నాయి.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా గ్లింప్స్ కు, అందులో రాజశేఖర్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది.

ఎల్లుండి (5వ తేదీ) నుంచి ఈ సినిమా ప్రచారాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు. ఆ రోజున సినిమా ఫస్ట్ సింగిల్ ను లాంచ్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.