బిగ్ బ్రేకింగ్.. ఆర్ఆర్ఆర్ వాయిదా

ఊహాగానానే నిజమయ్యాయి. అంతా అనుకున్నదే జరిగింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడింది. తప్పనిసరి పరిస్థితుల మధ్య ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మధ్య ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలోకి తీసుకురాలేమని విస్పష్టంగా ప్రకటించింది.

ఢిల్లీలో థియేటర్లు ఇప్పటికే మూసేశారు. మహారాష్ట్రలో ఆక్యుపెన్సీని 50శాతానికి తగ్గించారు. తమిళనాడులో కూడా 10వ తేదీ వరకు 50శాతం ఆక్యుపెన్సీ అమల్లోకి వచ్చేసింది. కేరళ, కర్నాటక కూడా అదే బాటలో ఉన్నాయి. మరోవైపు యూఎస్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్స్ పడుతున్నాయి.

ఇలాంటి టైమ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావించింది యూనిట్. అందుకే తమ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. నిన్నట్నుంచి ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

ఆర్ఆర్ఆర్ వాయిదా పడ్డంతో ఇప్పుడు మరికొన్ని సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. మరోవైపు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన డీజే టిల్లూ అనే సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయబోతున్నారు. మరోవైపు రాధేశ్యామ్ సినిమాను కూడా పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది.