రేపట్నుంచి తెలంగాణ థియేటర్లలో షాక్

సగటు సినీ ప్రేక్షకుడికి రేపట్నుంచి తెలంగాణ థియేటర్లలో షాక్ తగలబోతోంది. తెలంగాణ ప్రభుత్వం పెంచిన టికెట్ రేట్లను రేపట్నుంచి థియేటర్లు అమల్లోకి తీసుకురాబోతున్నాయి. దీంతో బాల్కనీ రేట్లు భారీగా పెరగబోతున్నాయి. ప్రేక్షకుడి జేబుకు భారీగా చిల్లు పడబోతోంది.

ఉదాహరణకు అర్జున-ఫాల్గుణ మూవీనే తీసుకుందాం. ఈ సినిమాను చూడాలంటే.. హైదరాబాద్ మల్టీప్లెక్సులో 330 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. ఓ చిన్న సినిమాకు ఇంత పెట్టి థియేటర్ కు వెళ్తాడా అనేది అనుమానమే. మరోవైపు సినిమా బడ్జెట్, రేంజ్ బట్టి 295 రూపాయల వరకు టికెట్ పెట్టుకోవచ్చని ప్రభుత్వం చెబితే.. డిస్ట్రిబ్యూటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మాత్రం ప్రతి సినిమాకు 295 ఫిక్స్ చేశాయి. దీంతో చిన్న సినిమాలకు చిక్కొచ్చిపడింది.

మరోవైపు బాల్కనీ కంటే కింద స్థాయి ధరలు అందుబాటులోనే ఉన్నాయి. అవి కూడా సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మల్టీప్లెక్సుల్లో ఈ రేట్లు కూడా చుక్కల్ని తాకుతున్నాయి. తెలంగాణలో పెంచిన టికెట్ రేట్లు టాలీవుడ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్ కు దూరమయ్యే ప్రమాదముందని, నిపుణులు అంచనా వేస్తున్నారు.