మరోసారి తెరపైకి రంగస్థలం కాంబో!

టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన సినిమా అది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఇద్దరి మధ్య కథాచర్చలు కూడా మొదలయ్యాయి.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. రాజమౌళి, ఎన్టీఆర్ తో కలిసి ఛానెల్స్ చుట్టేస్తున్నాడు. ఈ ప్రచారంలో భాగంగా రామ్ చరణ్, సుకుమార్ కొత్త సినిమా విశేషాల్ని బయటపెట్టాడు దర్శకుడు రాజమౌళి. వాళ్లిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో ఓపెనింగ్ సీన్ తనకు తెలుసని, అది చాలా బాగుంటుందని చెప్పాడు.

అయితే వీళ్లిద్దరూ కలిసి సెట్స్ పైకి రావడానికి కనీసం ఏడాదిన్నర పట్టేలా ఉంది. ఎఁదుకంటే, సుకుమార్ చేతిలో ప్రస్తుతం పుష్ప-2 సినిమా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయితే తప్ప చరణ్ దగ్గరకు రాలేడు. అటు చరణ్ చేతిలో కూడా శంకర్ మూవీ, గౌతమ్ తిన్ననూరి సినిమాలున్నాయి.