ఆర్ఆర్ఆర్ నుంచి మళ్లీ అదే క్లారిటీ

ఉత్తరాదిన పాక్షిక లాక్ డౌన్ నడుస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు మూతపడుతున్నప్పటికీ ఆర్ఆర్ఆర్ యూనిట్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ సినిమాను జనవరి 7న విడుదల చేసి తీరతామని ప్రకటించింది. ఈ మేరకు మరోసారి యూనిట్ నుంచి క్లారిటీ వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కు సంబంధించిన 2 కొత్త పోస్టర్లను విడుదల చేసి మరీ, ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను మరోసారి ప్రకటించారు మేకర్స్.

ఒమిక్రాన్ విజృంభిస్తున్నప్పటికీ, ఆర్ఆర్ఆర్ ను మరోసారి వాయిదా వేయడానికి మేకర్స్ ఇష్టపడడం లేదు. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను వాయిదా వేస్తే నిర్మాతకు మరింత నష్టం. పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. కరోనా నేపథ్యంలో ఆ బిజినెస్ మార్జిన్లు కూడా తగ్గించుకున్నారు. ప్రచారం కూడా దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇలాంటి టైమ్ లో సినిమాను వాయిదా వేస్తే మొదటికే మోసం వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే చెప్పిన తేదీకే థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

బాహుబలి-2 రికార్డును ఆర్ఆర్ఆర్ బద్దలుకొడుతుందనే అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యథిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా బాహుబలి-2 చెక్కుచెదరని రికార్డ్ సృష్టించింది. ఆ రికార్డును ఆర్ఆర్ఆర్ క్రాస్ చేయడం దాదాపు అసాధ్యమనే విషయం ఇప్పటికే తేలిపోయింది.

లండన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్ లాంటి దేశాల్లో లాక్ డౌన్ ఆంక్షలు నడుస్తున్నాయి. యూఎస్ లో పాక్షిక ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఇండియాలో పరిస్థితి అందరికీ తెలిసిందే. చాలా చోట్ల 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లో ఉంది. దీనికితోడు ఏపీలో టికెట్ రేట్లు తగ్గించారు. దీంతో బాహుబలి-2ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేయడం కష్టమే అంటోంది ట్రేడ్.