ప్రపంచ జనాభా తగ్గుతోందా?

గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచ జనాభా పెరగడమే తప్ప తగ్గడమనేది లేదు. కానీ మొట్టమొదటి సారి ప్రపంచ జనాభా తగ్గుముఖం పట్టే దిశగా సాగుతోందని అధ్యయనాలు చెప్తున్నాయి. నిజంగా జనాభా తగ్గుతోందా? గణాంకాలు ఏం చెప్తున్నాయి?

వచ్చే వందేళ్ల కాలంలో ప్రపంచ జనాభా తగ్గిపోనుందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.8 బిలియన్లు. 2064 నాటికి ఈ సంఖ్య 9.7 బిలియన్‌కు చేరుకుని, ఆ తర్వాత 2100లోగా 8.79 బిలియన్‌కు తగ్గుతుందని ఈ అధ్యయనం చెప్తోంది.

ఇదే ముఖ్యం
జనాభాను నిర్ణయించడంలో సంతానోత్పత్తి రేటును ముఖ్యమైన అంశంగా చూస్తారు. అంటే ఒక స్త్రీ సగటున ఎంతమందికి జన్మనిస్తోంది అనే సంఖ్యను బట్టి జనాభా పెరుగుతుందా, తగ్గుతుందా అనేది అంచనా వేస్తారు. ఈ సంతానోత్పత్తి రేటును పరిశీలిస్తే రాను రాను ఈ రేటు తగ్గుతోందని గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచం మొత్తంలో 2017లో 2.37గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2100 నాటికి 1.66 వరకు తగ్గుతుందని అంచనా వేశారు. అంటే రాబోయే రోజుల్లో జనాభా విపరీతంగా తగ్గబోతోందని అర్థం.

కారణాలివే..
సరైన జీవన ప్రమాణాలు లేకపోవడం, ఆదాయం తగ్గిపోవడం, ఆడవాళ్లు ఇంటిపనులతో పాటు ఉద్యోగాలు కూడా చేయాల్సి రావడం, ఆర్థికపరమైన ఇబ్బందులు.. ఇలాంటి కారణాల వల్లనే చాలామంది దంపతులు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని వద్దనుకుంటున్నారని నిపుణులు అంటున్నారు.

ఇదే మొదటిసారి
ఇప్పటికే ఎక్కువ ఉన్న వృద్ధ జనాభా, దీనికితోడు తక్కువ జననాల రేటు కారణంగా జపాన్, థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో జనాభా 50 శాతానికి పైగా తగ్గిపోయే అవకాశం ఉంది. 2017లో 1.4 బిలియన్‌గా ఉన్న చైనా జనాభా 2100 నాటికి 732 మిలియన్‌కు పడిపోతుందని అంచనా. అలాగే 1.39 బిలియన్లు ఉన్న భారత్‌ పాపులేషన్ 2100 నాటికి 1.09 బిలియన్‌కు చేరుకుంటుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఆఫ్రికా దేశాల్లో మాత్రం జనాభా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని సర్వేల్లో తేలింది. ఏదేమైనా 14వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి ప్రభావం తర్వాత ఇంతలా జనాభా తగ్గుతుండటం ఇదే మొదటిసారి అని అధ్యయనకారులు చెప్తున్నారు.