ఈ ఏడాది గూగుల్‌ను అడిగిన విషయాలివే..

2021 సంవత్సరం ముగుస్తోంది. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ప్రతిసారీ ఏడాది ముగిసే సమయానికి ఆ సంవత్సర కాలంలో ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలేంటో గూగుల్ వెల్లడిస్తుంది. ఈసారి కూడా ఆ లిస్ట్‌ను మన ముందుంచింది. 2021లో మనదేశంలో యూజర్లు ఎక్కువగా వెతికిన విషయాలేంటంటే..

ఈ ఏడాది ఎన్నో ముఖ్యమైన ఈవెంట్స్ జరిగాయి. స్పోర్ట్స్ నుంచి సినిమాల వరకూ అన్నిరంగాల్లో ఈ ఎడాది కాస్త ఊపు కనిపించింది. ఎలాగూ కరోనా కూడా ఉంది కాబట్టి అది కూడా ట్రెండింగ్‌లోనే ఉంది. మనదేశంలో క్రికెకట్‌కు క్రేజ్ తగ్గదని మరోసారి రుజువైంది. ఎందుకంటే ఈ ఏడాది కూడా ఐపీఎల్‌ టాప్ ట్రెండింగ్ సెర్చ్ లిస్ట్‌లో ఉంది. ఓసారి లిస్ట్ పరిశీలిస్తే.. ఐపీఎల్, కొవిన్ పోర్టల్‌, ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌, యూరో కప్‌, టోక్యో ఒలింపిక్స్‌, కొవిడ్ వ్యాక్సిన్‌, ఫ్రీ ఫైర్‌ రిడీమ్ కోడ్‌ , కోపా అమెరికా, నీరజ్‌ చోప్రా , ఆర్యన్‌ ఖాన్‌.. కీవర్డ్స్ టాప్ 10 లో ఉన్నాయి.

సినిమాల్లో..
ఇకపోతే సినిమా కేటగిరీలో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా జై భీమ్. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో మంచి ఆదరణ పొందిన సినిమాగా జై భీమ్‌ను చెప్పుకోవచ్చు. లిస్ట్‌లో తర్వాత షేర్షా, రాధే, బెల్‌బాటమ్‌, ఎటర్నల్స్‌, మాస్టర్‌, సూర్యవంశీ, గాడ్జిల్లా vs కాంగ్, దృశ్యం 2, భుజ్‌.. ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

మనుషుల లిస్ట్..
ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన మనుషుల లిస్ట్‌లో అందరికంటే ముందు నీరజ్ చోప్రా ఉన్నారు. టోక్యో ఒలిపింక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు గోల్డ్ మెడల్ తెచ్చిన నీరజ్‌ చోప్రా గురించి ఎక్కువ మంది యూజర్స్ గూగుల్ చేశారు. ఆ తర్వాత షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్, నటి షెహనాజ్‌ గిల్‌, రాజ్‌ కుంద్రా, ఎలన్‌ మస్క్, విక్కీ కౌశల్, పీవీ సింధు, బజరంగ్‌ పునియా, సుశీల్‌ కుమార్‌, నటాషా దలాల్‌ ఉన్నారు.

హౌటు..
‘హౌ టు’ అనే ట్యాగ్‌తో ఎక్కువ సెర్చ్ చేసిన విషయాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ముందుంది. కోవిడ్ వ్యాక్సిన్, వ్యాక్సిన్ సర్టిఫికేట్, ఆక్సిజన్ లెవల్స్, పాన్ ఆధార్ లింక్ అనే టాపిక్స్‌ను చాలామంది సెర్చ్ చేశారు.
వీటితో పాటు వార్తా సమాచారాలకు సంబంధించి.. టోక్యో ఒలింపిక్స్, బ్లాక్‌ఫంగస్‌, అఫ్గాన్‌ ఇష్యూ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, లాక్‌డౌన్‌, సూయజ్ కెనాల్ గురించి ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది.