రవితేజ నుంచి మరో రిలీజ్ డేట్

రవితేజ నుంచి మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. దీని పేరు ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మాండవ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇది. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రవితేజపై యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్ ఈరోజు రిలీజ్ డేట్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 25న సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌కానుంది. మార్చి చివరి వారం నుంచి సమ్మర్ సీజన్ మొదలవుతుంది. సమ్మర్ రేసులో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో బరిలోకి దిగబోతోన్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రైతులు, పోలీస్ అధికారులు కూడా ఈ పోస్టర్‌లో చూడొచ్చు.

దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్‌ జోరు పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది.