దృశ్యం-2 మూవీ రివ్యూ

నటీనటులు: వెంకటేష్, మీనా, కృతిక, ఎస్తర్, వీకే నరేష్, నదియా, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణమ్మ, సంపత్ రాజ్, పూర్ణ, సత్యం రాజేష్, షఫీ తదితరులు
సినిమాటోగ్రఫీ : సతీష్ కురూప్
మ్యూజిక్ : అనూప్ రుబెన్స్
నిర్మాతలు : సురేష్ బాబు ,ఆంటోనీ పెరుమ్బవూర్ , రాజ్ కుమార్ సేతుపతి , జాకర్ కె బాబు
రచన -దర్శకత్వం : జీతూ జోసెఫ్
నిడివి : 157 నిమిషాలు
వేదిక: ప్రైమ్ వీడియోస్
రేటింగ్: 2.75/5

ఓటీటీ కంటెంట్ విపరీతంగా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఓ మోస్తరు థ్రిల్ అందిస్తే ప్రేక్షకుడికి సరిపోవడం లేదు. ఊహించని ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు మాత్రమే తృప్తిచెందుతున్నాడు. అలాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్ ను పుష్కలంగా అందించింది దృశ్యం-2 సినిమా. ఇంకా చెప్పాలంటే ఈమధ్య కాలంలో ఇటు ఓటీటీలో, అటు థియేటర్లలో రిలీజైన ఏ సినిమా ఈ స్థాయిలో థ్రిల్ అందించలేకపోయింది.

దృశ్యం సినిమా సూపర్ హిట్టయిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి కారణం అందులో ఊహించని ట్విస్టులే. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో డెడ్ బాడీని పోలీస్ స్టేషన్ మధ్యలోనే హీరో పాతిపెట్టాడనే విషయం తెలిసిన తర్వాత ప్రేక్షకులంతా థ్రిల్ ఫీలయ్యారు. ఆ పాయింట్ నుంచి మళ్లీ సినిమాను కొనసాగించాలంటే అంతకంటే ఎక్కువ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టాలి. మరింత ఎమోషన్ దట్టించాలి. సరిగ్గా జీతూ జోసెఫ్ అదే పని చేశాడు.

దృశ్యం సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా దృశ్యం-2 సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే దృశ్యం ఇచ్చిన ఫీలింగ్ తో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ఆడియన్స్ మాత్రం కాస్త నిరుత్సాహ పడతారు. రాంబాబు (వెంకటేశ్) తెలివితేటలు మనం ఊహించుకునే స్థాయి కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఇంతకుముందే చెప్పుకున్నట్టు దృశ్యం క్లైమాక్స్ లో కనిపించిన లాంటి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే సన్నివేశాలు మాత్రం పార్ట్-2లో పెద్దగా కనిపించవు.

అలా అని దృశ్యం-2ను తీసిపారేయడానేం లేదు. స్టార్టింగ్ నుంచి శుభం కార్డు పడే వరకు సినిమా ఎంగేజింగ్ గా సాగుతుంది. ఈ విషయంలో దర్శకుడికి పూర్తి మార్కులు వేయొచ్చు. అతడు రాసుకున్న స్క్రీన్ ప్లే అందర్నీ మెప్పిస్తుంది. అయితే ఇక్కడ కూడా చిన్న సవరణ చెప్పుకోవాలి. ఈ సినిమా మలయాళం వెర్షన్ ఆల్రెడీ రిలీజైంది. అది కూడా ఓటీటీలోనే. మెహన్ లాల్ వెర్షన్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఎవరైనా ఉంటే మాత్రం, ఈ వెంకటేశ్ వెర్షన్ పెద్దగా ఎక్కకపోవచ్చు. ఆ ఎక్సయిట్ మెంట్ ఉండదు.

ఇక తెలిసిన కథే కాబట్టి క్లుప్తంగా చెప్పుకుందాం.. మొదటి పార్ట్ లో రాంబాబు(వెంకటేష్) తన భార్య జ్యోతి(మీనా) పిల్లలు అంజు(కృతిక), అను(ఎస్తర్) లు వరుణ్ హత్య కేసు నుండి తన తెలివితేటలతో బయటపడేస్తాడు. ఇప్పుడు సీక్వెల్ కి వస్తే రాంబాబు కుటుంబ పరిస్థితులు అన్నీ మారతాయి. ఆరేళ్లలో రాంబాబు తనకున్న సినిమాపై మక్కువతో ఆ రంగంలోనే థియేటర్ నుంచి నిర్మాత స్థాయికి ఎదుగుతాడు. ఓ సినిమా తీసే ప్లానింగ్ లో ఉంటాడు. మరోవైపు తన బిడ్డ వరుణ్ ను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఐజీ గీతా ప్రభాకర్(నదియా), ఆమె భర్త ప్రభాకర్ (వీకే నరేష్)లు యూఎస్ లో సెటిల్ అవుతారు. కానీ ఏదో ఒక రోజు తమ బిడ్డ శవం దొరుకుతుందేమో అనే ఆశతో రాంబాబు ఉన్న గ్రామానికి తరచూ వస్తుంటారు. మరో వైపు అక్కడికి కొత్తగా వచ్చిన ఐజీ(సంపత్ రాజ్) క్లోజ్ అయిన వరుణ్ కేసును సీక్రెట్ గా రీ-ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అక్కడి నుండి మళ్ళీ రాంబాబు కుటుంబానికి సవాళ్లు ఎదురవుతాయి. మరి వరుణ్ మృతదేహం బయటకు వస్తుందా? ఈసారి రాంబాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.

తెలిసిన కథనే దర్శకుడు జీతూ జోసెఫ్ తన స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశాడు. మొదటి భాగాన్ని రాంబాబు ప్రొఫెషన్, ఎమోషన్స్ కు కేటాయించిన దర్శకుడు.. సెకండాఫ్ లో తన స్క్రీన్ ప్లే చమక్కులు, ట్విస్టులకు కేటాయించాడు. ఈ క్రమంలో సెకండాఫ్ లో ఎమోషనల్ కంటెంట్ మిస్ అయింది. అయితే ఆ విషయం పెద్దగా ప్రేక్షకుడి స్ఫురణకు రాదు. ఎక్కడికక్కడ లాక్స్ వేసుకుంటూ క్లైమాక్స్ కు తీసుకెళ్తాడు దర్శకుడు.

వెంకటేష్ మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ చూపించాడు. మలయాళంలో చేసిన మోహన్ లాల్ అంత కాకపోయినా, తనదైన ఎక్స్ ప్రెషన్స్ తో అలరించాడు. మీన, నదియా, నరేష్ తమ పాత్రలకు న్యాయంచేశారు. టెక్నికల్ గా చూసుకుంటే జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు.

ఓవరాల్ గా దృశ్యం-2 సినిమా అందర్నీ మెప్పిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ చూడని ప్రేక్షకులైతే ఈ సినిమాకు ఫిదా అవ్వడం ఖాయం.