పెళ్లి చేసుకోలేదని యువకుడిపై యువతి యాసిడ్ దాడి..!

మామూలుగా ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదని యువతుల పై యువకులు యాసిడ్ దాడి చేసే సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. కానీ తాజాగా కేరళ రాష్ట్రంలో తనను ఓ యువకుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని మహిళ యాసిడ్ తో దాడి చేసింది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

తిరువనంతపురంకు చెందిన షీబా, అరుణ్ సోషల్ మీడియా ద్వారా ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొద్దిరోజుల పాటు వారిద్దరూ ప్రేమగా మెలగగా.. ఆ తర్వాత షీబాకు ఇదివరకే పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అరుణ్ కు తెలిసింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అరుణ్ షీబాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

కానీ షీబా మాత్రం అరుణ్ ను వదల్లేదు.తనను పెళ్లి చేసుకోవాలని అతడి వెంట పడేది. అంతే కాకుండా ప్రేమ వ్యవహారం ఇతరులకు చెబుతానని బెదిరించి షీబా అరుణ్ నుంచి రూ. రెండు లక్షలు తీసుకుంది. అంతటితో ఆగకుండా తనను పెళ్లి చేసుకోవాలని వేధించేది.

అరుణ్ పెళ్లి చేసుకునేందుకు ఎంతకూ అంగీకారం తెలపక పోవడంతో అతడిపై యాసిడ్ దాడి చేయాలని షీబా నిర్ణయించుకుంది. ఒకరోజు అరుణ్ తన స్నేహితులతో కలిసి ఉండగా అక్కడికి వచ్చిన షీబా ఉన్నట్టుండి యాసిడ్ బాటిల్ తీసి అరుణ్ ముఖంపై చల్లింది. పక్కనే ఉన్న స్నేహితులు అరుణ్ ను వెంటనే తిరువనంతపురం ఆసుపత్రికి తరలించారు. కాగా షీబా జరిపిన యాసిడ్ దాడిలో అరుణ్ కు పూర్తిగా కంటి చూపు పోయింది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు షీబాను అరెస్టు చేశారు.