రాజా విక్రమార్క మూవీ రివ్యూ

నటీనటులు: కార్తికేయ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు
సినిమాటోగ్రఫీ : పి.సి.మౌళి
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
బ్యానర్ : శ్రీ చిత్ర మూవీ మేకర్స్
నిర్మాత: ’88’ రామారెడ్డి
దర్శకత్వం: శ్రీ సరిపల్లి
రిలీజ్ డేట్: నవంబర్ 12, 2021
రేటింగ్: 2/5

సీరియస్ కథని సరదాగా చెప్పడం ఇప్పుడో ఫ్యాషన్. ఈ ట్రెండ్ చాన్నాళ్ల కిందటే మొదలైంది. రీసెంట్ గా డాక్టర్ అనే డబ్బింగ్ సినిమా ఇదే ఫార్మాట్ లో వచ్చి మెప్పించింది. ఇప్పుడు తెలుగులో రాజా విక్రమార్క పేరిట ఇలాంటిదే మరో ప్రయత్నం జరిగింది. కానీ వ్యవహారం పూర్తిగా బెడిసికొట్టింది. అటు కామెడీని పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేక, ఇటు సీరియస్ గా కథ చెప్పలేక నానా తంటాలు పడ్డారు మేకర్స్. ఫలితంగా ప్రేక్షకులకు పెద్ద తంటా తెచ్చిపెట్టారు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇదొక సీరియస్ కథ. సినిమాలో హీరో ఎన్ఐఏ ఏజెంట్. అతడికి చాలా పెద్ద టాస్క్ అప్పగిస్తారు. హోం మినిస్టర్ పై జరగబోయే హత్యాయత్నాన్ని హీరో ఆపాలి. అదే టైమ్ లో కిడ్నాప్ అయిన హోం మినిస్టర్ కూతురును కాపాడి తీసుకురావాలి. మరోవైపు తనపై పడ్డ మచ్చను చెరిపేసుకోవాలి. ఇలాంటి క్లిష్టమైన లైన్ లోకి కామెడీని ఇరికించడం కాస్త కష్టమైన పనే. కానీ దర్శకుడు శ్రీ సరిపల్లి చాలా ప్రయాసపడ్డాడు.

ఫస్టాఫ్ ను సరదాగా చూపించి, సెకెండాఫ్ లో ఎమోషన్, యాక్షన్ చూపిద్దాం అనుకున్నాడు దర్శకుడు. అతడు అనుకున్నట్టు ఫస్టాఫ్ లో అంత సరదా సీన్లు ఏమీ లేవు. సెకెండాఫ్ లో మనసు బరువెక్కేంత ఎమోషన్ కూడా లేదు. దీనికితోడు లాజిక్ లేని సీన్లు, సినిమాటిక్ ఫ్రీడమ్ మరీ ఎక్కువైంది. ఎంత ఎక్కువైందో ఓ ఉదాహరణతో చెప్పుకుందాం. సినిమాలో హోం మినిస్టర్ కూతురు ఓ సాధారణ అమ్మాయిలా ఆటోల్లో, చిన్న కారులో తిరిగేస్తుంటుంది. ఆమెకు ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు ఉండవు. ఒక సీన్ లో హీరోతో కలిసి ఏకంగా సిటీ పొలిమేరలకు కూడా వెళ్లిపోతుంది. ఇదొక లాజిక్ లేని సన్నివేశమైతే.. ఇంటర్వెల్ కార్డు దగ్గర చూపించిన సీన్ మరీ అతిగా అనిపిస్తుంది.

హోం మినిస్టర్ పాల్గొన్న కార్యక్రమంలో, భారీ సెక్యూరిటీ ఉన్న ఈవెంట్ లో హీరోయిన్ డాన్స్ చేస్తుంటే.. ఆమె స్టేజీకి పెద్ద చిల్లు పడడం, ఆ చిల్లు నుంచి హీరోయిన్ అమాంతం అలా కిందకు పడిపోయి, కిడ్నాప్ అవ్వడం లాంటి సన్నివేశాలు కాస్త అతి అనిపిస్తాయి. పోనీ ఇలాంటి సన్నివేశాల్లో విలన్ ను కాస్త టెక్నికల్ గా సౌండ్ ఉండేలా, లేదా బాగా తెలివితేటలు ఉన్నోడిగా చూపించినా బాగుండేది. మాసిపోయిన దుస్తులేసుకొని తిరిగే మాజీ నక్సలైట్ పాత్ర అది. అతడి చుట్టూ ఉన్న సెటప్ కూడా ఏమంత హైటెక్ గా ఉండదు.

ఇలాంటి లాజిక్ లేని సన్నివేశాలున్నప్పటికీ, మంచి కామెడీ ఉంటే అన్నీ కవర్ అయిపోతాయి. ప్రేక్షకులు ఈజీగా క్షమించేస్తారు. కానీ రాజా విక్రమార్కలో ఆ కామెడీ కూడా కరువైంది. హీరో కార్తికేయతో కామెడీ చేయించాలని ప్రయత్నించి అట్టర్ ఫెయిల్ అయ్యాడు దర్శకుడు. విలన్ గ్యాంగ్ లో ఉన్న సభ్యులతో కూడా కామెడీ చేయించాలా వద్దా అన్నట్టు పంచ్ లు వేయించాడు. అవి పేలలేదు. ఓ 2 యాక్షన్ సీన్లు మెప్పిస్తున్నాయని మనసులో అనుకున్న టైమ్ లో అక్కడో కామెడీ సీన్ పెట్టి.. సినిమాను కామెడీ చేసి పడేశాడు దర్శకుడు.

ఇలా అటు కామెడీకి దూరంగా, థ్రిల్ కు ఆమడదూరంగా తెరకెక్కిన ఈ సినిమా ఏ దశలోనూ ఆకట్టుకోదు. ఉన్నంతలో హీరో కార్తికేయ తన సిక్స్ ప్యాక్ బాడీ, యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. మరో నటుడు సుధాకర్ కోమాకుల సినిమాలో సర్ ప్రైజ్ ప్యాకేజీ. కొత్త హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ బాగుంది. ఆమె యాక్టింగ్ కూడా ఓకే. సాయికుమార్, పశుపతి, తనికెళ్లభరణి తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా సినిమాలో చెప్పుకోడానికి సినిమాటోగ్రఫీ ఉంది. మౌళి సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ లో మంచి ఫ్రేమ్స్ చూపించాడు. ప్రశాంత్ విహారి ఓ పాటతో ఆకట్టుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు. నిర్మాత రామారెడ్డి తన తొలి సినిమాకు బాగానే ఖర్చు చేశాడు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ ఓకే.

ఓవరాల్ గా రాజా విక్రమార్క సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది. మరోసారి చిరంజీవి సినిమా టైటిల్ వృధా అయింది.