‘మెటా‘గా మారిన ఫేస్ బుక్..

సోషల్ మీడియాలో ప్రజల అభిప్రాయాలు పంచుకోడానికి రూపొందిన ఫేస్ బుక్ తర్వాతి కాలంలో అతి పెద్ద సంస్థగా ఎదిగింది. తనతోపాటు ఎదుగుతున్న అనేక సామాజిక మాధ్యమాలను తనలో కలిపేసుకుంది. ఒకరకంగా తనకు పోటీ వస్తాయనుకున్న వాటన్నిటినీ ఫేస్ బుక్ అమాంతం మింగేసిందనే చెప్పాలి. వాట్సప్, ఇన్ స్టాగ్రామ్.. ఇలా అన్నీ ఫేస్ బుక్ నీడకిందకే వచ్చి చేరాయి. ఇన్ని ప్లాట్ ఫామ్ లు ఉన్నా కూడా ప్రధాన కంపెనీ పేరు ఫేస్ బుక్ గానే ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ‘మెటా‘ గా మార్చేశారు అధినేత జుకర్ బర్గ్. నాలుగైదు రోజులుగా దీనిపై సోషల్ మీడియాలో లీకులు వస్తున్నా.. ‘ఫేస్ బుక్‘ కంపెనీ పేరు ‘మెటా‘గా మార్చేస్తున్నట్టు జుకర్ బర్గ్ ప్రకటన విడుదల చేేయడంతో ఇది అధికారికం అయింది.

ప్రస్తుతం వర్చువల్ రియాలిటీ అనే కొత్త టెక్నాలజీపై ఫేస్ బుక్ అత్యథిక పెట్టుబడి పెట్టి పరిశోధనలు కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టింది. భవిష్యత్ అంతా వర్చువల్ రియాలిటీ (మెటావర్స్‌)దేనంటున్న జుకర్ బర్గ్.. దాని ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఫేస్ బుక్ సంస్థ పేరు మార్చేసినట్టు తెలిపారు.

పేరుమారినా..
కంపెనీ పేరు మారినా.. సామాజిక మాధ్యమంగా మనం వినియోగించే ఫేస్ బుక్ పేరు మాత్రం అలాగే ఉంటుంది. ఫేస్‌ బుక్‌ తోపాటు, ఇన్‌ స్టాగ్రాం, వాట్సప్‌ పేర్లలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. వాట్సప్ ఫ్రం ‘ఫేస్ బుక్‘ అని ఇప్పటి వరకూ మన ఫోన్లలో కనిపిస్తుంది, ఇకపై అది వాట్సప్ ఫ్రం ‘మెటా‘ అని కనిపించబోతుంది. పేరు మార్పు సందర్భంగా ‘మెటా’ అనేది గ్రీకు పదమని, దానికి ఇంకే విపరీతార్థాలు వెదకొద్దని క్లారిటీ ఇచ్చారు జుకర్ బర్గ్.