బైక్ రేసింగ్ తోనే సాయి తేజ్ కి ప్రమాదం? ఆ కోణంలోనూ పోలీసుల దర్యాప్తు..!

చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం పై మరో కొత్త కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. సాయి ధరమ్ తేజ్ బైక్ రేసింగ్ లో పాల్గొన్నాడని.. ఆ కారణంగానే ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు కూడా సాయి ధరమ్ తేజ్ బైక్ రేసింగ్ లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి.

తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక సీనియర్ నటుడి కుమారుడితో సాయి తేజ్ బైక్ రేసింగ్ పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు పోటాపోటీగా వేగంగా వెళుతుండటం వల్లే సాయి తేజ్ నడుపుతున్న బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 10వ తేదీన సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ ప్రమాదానికి గురయ్యాడు. బైక్ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత సీసీ టీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. అందులో రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ పై రాయదుర్గం పోలీసులు ఇప్పటికే ఐసీసీ 336, మోటార్ వెహికల్ యాక్ట్ 184 కింద రెండు కేసులు నమోదు చేశారు.

తాజాగా బైక్ రేసింగ్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో దీనిపై మాదాపూర్ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు. కాగా బైక్ రేసింగ్ వల్లే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడని పోలీసులు అధికారికంగా ప్రకటన చేయలేదు. పోలీసులు తమ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాతే ఇందుకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా సాయి తేజ్ ప్రమాదానికి గురైన తర్వాత సుమారు నెల రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి చేరుకున్నారు.