అది కాకపోతే ఇది.. వాట్సప్ కి ప్రత్యామ్నాయం వెదికిన 7కోట్లమంది..

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్.. దాదాపు 7 గంటలపాటు స్తంభించిపోవడంతో ఆయా నెట్ వర్క్ లపై ఆధారపడివారంతా గొల్లుమన్నారు. మరుసటిరోజు ఉదయానికల్లా వాటి సేవల పునరుద్ధరణ మొదలయ్యే సరికి ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎక్కడో చిన్న అనుమానం, మరోసారి ఇలా జరిగితే తమ పరిస్థితి ఏంటి..? ఏడు గంటలు కాస్తా.. మరిన్నిగంటలు అయితే అప్పుడెలా..? రాత్రి కాబట్టి సరిపోయింది, అదే ఉదయం అయితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేది. దీంతో చాలామంది ప్రత్యామ్నాయం వెదికే పనిలో పడ్డారు.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటివాటికి కాసేపు దూరంగా ఉండటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ స్మార్ట్ ఫోన్ ని కేవలం వాట్సప్ కోసమే వినియోగించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారంతా వాట్సప్ కి ఆల్టర్నేట్ ఆలోచించుకున్నారు. ఏడుగంటల ఎఫెక్ట్ తో మొత్తం 7కోట్లమంది టెలిగ్రామ్ యాప్ ని కొత్తగా ఇన్ స్టాల్ చేసుకున్నారు. టెలిగ్రామ్ సీఈఓ పవేల్ దురోవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

వాట్సప్, పేస్ బుక్, ఇన్ స్టా సేవలు ఆగిపోయిన తర్వాత ట్విట్టర్ కి కూడా ఆ టైమ్ లో బాగా క్రేజ్ పెరిగినా.. వ్యక్తిగత మెసేజ్ లు పంపించుకునే వాట్సప్ లాంటి మాధ్యమంకోసం చాలామంది వెదికారు, వారికి టెలిగ్రామ్ యాప్ సరిగ్గా సరిపోయింది. ఇటీవలే 100 కోట్ల డౌన్లోడ్ మార్క్ ని టెలిగ్రామ్ యాప్ చేరుకుంది.

అప్పుడు ప్రైవసీ పాలసీ, ఇప్పుడు నెట్ వర్క్..
ఈ ఏడాది మొదట్లో వాట్సప్ ప్రైవసీ పాలసీ విషయంలో జరిగిన గందరగోళం అందరికీ తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వం కూడా వాట్సప్ విషయంలో కఠినంగానే వ్యవహరించింది. చివరకు వాట్సప్ వెనక్కు తగ్గేందుకు అంగీకరించింది. అదే సమయంలో లక్షలమంది టెలిగ్రామ్ వైపు చూశారు. ఇప్పుడు ఏకంగా నెట్ వర్క్ ఆగిపోవడంతో.. ఒక్క రోజులోనే 7కోట్లమంది కొత్తగా టెలిగ్రామ్ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవడం విశేషం.