పరీక్షల కాలం మొదలు.. విద్యార్థుల్లో గుబులు..

ఇంటర్ ఆల్ పాస్ అంటూ అప్పట్లో విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి షాకిచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పెట్టేందుకు టైమ్ టేబుల్ కూడా ప్రకటించింది. అక్టోబర్ 25వతేదీనుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులు ఈ పరీక్షలకోసం సన్నద్ధమయ్యారా? ఇప్పటికే సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ లతో కుస్తీ పడుతున్న పిల్లలంతా, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కి టైమ్ కేటాయించగలరా అనేదే ఇప్పుడు ప్రధాన సమస్య.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల్ని తెలంగాణ ప్రభుత్వం గతంలో రద్దు చేసింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ పాస్ అయినట్టేనని చెప్పారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం ఫస్ట్ ఇయర్ మార్క్ ల ఆధారంగా స్కోర్ కేటాయించారు. రాగా పోగా ఫస్ట్ ఇయర్ విద్యార్థుల పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. పరిస్థితులు చక్కబడితే వారికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినా, థర్డ్ వేవ్ భయాలతో చాన్నాళ్లుగా దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు విద్యార్థులంతా ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవనే ధీమాతో ఉన్నారు. దాదాపుగా అందరూ సెకండ్ ఇయర్ సిలబస్ లోకి వెళ్లిపోయారు. వాస్తవానికి అక్టోబర్ కి అందరూ హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ కి సిద్ధం కావాల్సిన సమయం. కానీ విచిత్రంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి.

ప్రభుత్వ వాదన ఇదీ..
ఫస్ట్ ఇయర్ లో పరీక్షలు లేకుండా ఆల్ పాస్ అనేస్తే.. రేపు ఇదే బ్యాచ్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసే సమయానికి కరోనా ప్రభావం మొదలైతే పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం వాదన. ప్రస్తుతం సెకండ్ ఇయర్ పూర్తి చేసినవారు, గతంలో ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు కాబట్టి వారికి మార్కులు ఇవ్వగలిగామని, కొత్త బ్యాచ్ కి ఆ అవకాశం లేకుండా పోతుందనేది అధికారుల ఆలోచన. అందుకే సెకండ్ ఇయర్ మధ్యలో ఫస్ట్ ఇయర్ పరీక్షలంటూ హడావిడి మొదలు పెట్టారు. నిన్న మొన్నటి వరకూ దీనిపై చర్చలు జరిగినా, ఎట్టకేలకు ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. టైమ్ టేబుల్ ఇచ్చేసింది.

విద్యార్థుల ఆందోళన ఇదీ..
ఇప్పటికే సెకండ్ ఇయర్ మూడ్ లోకి వచ్చేసిన విద్యార్థులు ఆ సిలబస్ తో కుస్తీ పడుతున్నారు. సిలబస్ పూర్తయితే ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి వాటికి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఈ దశలో ఫస్ట్ ఇయర్ పరీక్షలంటే తమపై అదనపు భారం పడుతుందని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం టైమ్ టేబుల్ కూడా ప్రకటించింది కాబట్టి చేసేదేమీ లేదని తేలిపోయింది. ఇటు ఏపీలో మాత్రం టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తిగా రద్దయ్యాయి.