రాజీనామా సవాళ్లతో వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు..

ఆమధ్య రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య తీవ్ర సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అయితే ఆ తర్వాత మంత్రే కాస్త వెనక్కు త‌గ్గారు. ఆ వివాదం సమసిపోయిందనుకుంటున్న టైమ్ లో మరో మంత్రి కేటీఆర్ రాజీనామా సవాళ్లు విసురుతున్నారు. ఇంతకు ముందు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న వ్యవహారం ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కి రాజీనామా సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్.

సహజంగా కేటీఆర్ ప్రతిపక్షాల వ్యాఖ్యలకు మరీ అంత సీరియస్ గా రియాక్ట్ కారు. ఆయా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండానే వాటి ప్రాధాన్యత తగ్గిస్తారు. కానీ ఈసారెందుకో నేరుగా ఆయన బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే నిరూపించు మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. ఉత్తర ప్రదేశ్‌ తో పాటు ఇతర రాష్ట్రాలకు కేంద్రం అందిస్తున్న నిధుల్లో తెలంగాణ ప్రజల స్వేదం, రక్తం ఉందని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలకు మొత్తం పైసలు కేంద్రం ఇస్తోందని, రాష్ట్రం మాత్రం సోకులు పడుతోందంటూ ఇటీవల బండి సంజయ్ తన పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. ఆయనవి సొల్లు కబుర్లు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి పన్నుల రూపంలో ఆరున్నరేళ్లలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించారని, కేంద్రం మాత్రం ఆర్థిక సంఘం నిధుల రూపంలో, జనాభా దామాషా ప్రాతిపదికన రాష్ట్రానికి రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఇచ్చిందన్నారు.

రాజీనామా చేస్తావా..?
పన్నుల రూపంలో తెలంగాణ, కేంద్రానికి ఇచ్చిన సొమ్ముకి, కేంద్రం నుంచి నిధుల రూపంలో తీసుకున్న సొమ్ముకి తీవ్ర వ్యత్యాసం ఉందని, తాను చెప్పింది తప్పయితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు కేటీఆర్. బండి సంజయ్ చెప్పిన మాటలు తప్పయితే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. “గద్వాల వేదికగా సవాల్ విసురుతున్నా.. దమ్ముంటే రుజువుచేయి సంజయ్” అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

రాష్ట్రంలోని నిధులు మొత్తం కేంద్రానివైతే కర్నాటకలో రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు కేటీఆర్. జోగులాంబ గద్వాల జిల్లా.. అలంపూర్‌లో రూ.21 కోట్లతో నిర్మిస్తున్న ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తమ నాయకుడిని ప్రజలు దీవిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్‌ నేతల కళ్లు మండుతున్నాయన్నారు. కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.