త్వరలో ఏపీ సీఎం జగన్.. చిరు భేటీ! ఏం చర్చిస్తారంటే?

ప్రస్తుతం కరోనా నిబంధనలు దాదాపు లేవు. అన్ని రాష్ట్రాల్లోనూ థియేటర్లు ఓపెన్​ అయ్యాయి. ఏపీలో మాత్రం థియేటర్ల యాజమాన్యానికి .. ప్రభుత్వానికి మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో అక్కడ థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్​ కావడం లేదు. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ నష్టపోతున్నది. మరోవైపు టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కరోనా తో ఆర్థికంగా చితికిపోయిన థియేటర్ల యజమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో సినీ పెద్దలు.. ప్రభుత్వంతో సమావేశమై పలు విషయాలపై చర్చించాలని భావించారు. చిరంజీవి నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దలు ఏపీ సీఎం జగన్​ను కలవబోతున్నారని.. ఇందుకోసం ఏపీ మంత్రి పేర్ని నాని చొరవ తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఉన్నట్టుండి ఈ మీటింగ్​ వాయిదా పడింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వమే ఆన్​లైన్​లో సినిమా టికెట్లు విక్రయించబోతున్నదని ఇందుకు సంబంధించి ఓ యాప్​ను కూడా రూపొందిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయంపై సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్​ యజమాన్యాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్త మయ్యాయి. మరోవైపు సినీ ఇండస్ట్రీ పెద్దలతో సీఎం జగన్​ భేటీ వాయిదా పడింది. దీంతో ఇండస్ట్రీ పెద్దలకు .. ప్రభుత్వ పెద్దలకు గ్యాప్​ ఏర్పడిందన్న వార్తలు వినిపించాయి.

అయితే ఎట్టకేలకు చిరంజీవి బృందంతో చర్చించేందుకు ఏపీ సీఎం జగన్​ ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ నెల 20న సమావేశం నిర్వహించబోతున్నట్టు టాక్​ వినిపిస్తోంది. టికెట్​ ధరలు, ప్రభుత్వం తీసుకొచ్చే యాప్​ తదితర విషయాలపై ఈ మీటింగ్​లో చర్చించే అవకాశం ఉంది. చిరంజీవితోపాటు హీరో నాగార్జున, నిర్మాతలు దిల్‌ రాజు, దగ్గుబాటి సురేశ్‌బాబు తదితరులు సీఎంతో సమావేశం కాబోతున్నారు.

తెలుగు ఇండస్ట్రీ పెద్దలతో వైసీపీ పెద్దలకు పెద్దగా సత్సంబంధాలు లేవని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇరు పక్షాలు ప్రవర్తిస్తున్నాయి. ప్రభుత్వంతో సఖ్యతతో వ్యవహరించడం సినీ పరిశ్రమ వారికి ఎంతో అవసరమని సినీ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాలు భేటీ అయి సానుకూల దృక్పథంతో చర్చలు జరుపుకోవడం శుభపరిణామమని అంటున్నారు. మొత్తానికి ఈ భేటీ అనంతరం అయినా ఏపీలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయేమో వేచి చూడాలి.