స్వాతిముత్యంగా మారిన బెల్లంకొండ

వెండితెరకు మరో వారసుడు హీరో గా పరిచయం అవుతున్నాడు. అతడి పేరు “గణేష్ బెల్లంకొండ” ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు ఈ ‘గణేష్’. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘గణేష్’ ను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తోంది. యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ, ‘గణేష్’ హీరోగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ అనే పేరును నిర్ణయించారు.

ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో
కథానాయకుడు గణేష్ భుజాన బ్యాగ్ తో ఉండటం కనిపిస్తుంది. ఆకర్షణీయమైన లోగో తో కూడిన చిత్రం పేరు కనిపిస్తుంది. ఈరోజు గణేష్ పుట్టినరోజు. అందుకే ఈ హంగామా అంతా.

‘వర్ష బొల్లమ్మ’ ఇందులో హీరోయిన్. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం.

గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్,
సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, దివ్య శ్రీపాద కీలక పాత్రలు పోషిస్తున్నారు.