తిరుమలలో సర్వదర్శనాలు పునఃప్రారంభం..

కరోనా కాలంలో సర్వదర్శనాలను పూర్తిగా నిలిపివేసి కేవలం 300 రూపాయల ప్రత్యేక దర్శనాలను మాత్రమే కొనసాగిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి సర్వదర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తామని ప్రకటించింది. ఉదయం 6గంటలనుంచి టోకెన్లు జారీ చేస్తారు. తొలి విడతగా.. రోజుకి 2వేల టికెట్లను మాత్రమే పరిమితంగా భక్తులకు అందిస్తారు. అయితే ఇందులో కూడా చిత్తూరు జిల్లాకు తొలి ప్రాధాన్యమిస్తామంటూ టీటీడీ ప్రకటించడం విశేషం. ఎట్టకేలకు 6 నెలలుగా ఆగిపోయిన శ్రీవారి సర్వదర్శనం.. ఇప్పుడు తిరిగి మొదలు కాబోతుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..
కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో పరిమితంగానే 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు జారీ చేసిన టీటీడీ.. ఆ తర్వాత వాటి సంఖ్యను పెంచింది. అదే సమయంలో సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను కూడా పరిమిత సంఖ్యలో స్వామివారి దర్శనానికి అనుమతించారు. అయితే సర్వదర్శనాలకు అనుమతి లేకపోవడంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు. 300 రూపాయల టికెట్లు కొనడానికి సిద్ధపడినా.. అవి కేవలం ఆన్ లైన్లోనే అందుబాటులో ఉండేవి, అవి కూడా జారీ చేసిన క్షణాల్లోనే భర్తీ అయ్యేవి. దీంతో శ్రీవారి దర్శనం సామాన్య భక్తులకు దుర్లభంగా మారింది. కనీసం కొండ ఎక్కాలన్నా కూడా దర్శనం టోకెన్ ఉండాల్సిందేననే నియమం పెట్టడంతో కొన్నాళ్లుగా కొండపై భక్తుల కళ తగ్గింది. ఇప్పుడు సర్వదర్శనాలు తిరిగి ప్రారంభం అవుతుండటంతో కొండపై మళ్లీ భక్తుల సందడి మొదలు కాబోతోంది. అయితే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో రోజుకి కేవలం 2 వేల టోకెన్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు అధికారులు. శ్రీనివాసం కాంప్లెక్స్ లో టోకెన్లు ఇస్తామని ప్రకటించారు.

గతంలో నిత్యం 8వేల సర్వదర్శనం టోకెన్లు జారీచేసేవారు. ప్రత్యేక దర్శనాలు, 300 రూపాయల దర్శనాలు వీటికి అదనం. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో పూర్తిగా దర్శనాలను నిషేధించగా, సెకండ్ వేవ్ సమయంలో కేవలం 300 రూపాయల టోకెన్లు మాత్రమే పరిమితంగా జారీ చేశారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టడం, జనజీవనం సాధారణ స్థాయికి చేరుకోవడంతో సర్వదర్శన టోకెన్లు జారీ చేయడానికి టీటీడీ నిర్ణయించింది.