పిల్లలు లావెక్కుతున్నారా?

కరోనా పుణ్యమా అని పిల్లలు స్కూల్ కు వెళ్లి రెండేళ్లయింది. స్కూల్ ఉంటే టైంకి స్కూల్ కు వెళ్లడం, టైంకి తినడం, ఆటలు ఆడడం లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. కానీ గత రెండేళ్లుగా పిల్లలు ఇంటికే పరిమితమవ్వాల్సి రావడంతో.. ఎలాంటి శారీరక వ్యాయామం లేక, ఆహారపు అలావాట్లలో మార్పులొచ్చి పిల్లల్లో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి.

గత ఏడాది నుంచి పిల్లల్లో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నట్టు కొన్ని స్టడీలు చెప్తున్నాయి. కరోనా మహమ్మారికి ముందు 10 నుంచి 13శాతం పిల్లల్లో మాత్రమే ఊబకాయం సమస్య ఉండేది. అయితే కరోనా తరువాత పిల్లల లైఫ్ స్టైల్ లో మార్పులు రావడం వల్ల ఈ ఊబకాయ సమస్య 16శాతానికి పెరిగింది. చిన్నారుల్లో ఫిజికల్ యాక్టివిటిస్ తగ్గడం దీనికి ప్రధాన కారణం.

రోజు వారి ఆటపాటలతో గడిపేవారు. స్కూల్ లో అటు ఇటు తిరగటం వంటి ఎదో ఒక యాక్టివిటీ ఉండేది. అయితే ప్రస్తుతం ఇంటి వద్దే ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండటంతో ఒకేచోట కూర్చుని ఉండటం. శారీరక వ్యాయామానికి దూరం కావటంతో వారిలో ఊబకాయం సమస్య పెరిగింది.

ఇంటి దగ్గరే ఉంటున్న పిల్లలకు ఆహారం, వ్యాయామం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అలా తీసుకోకపోవడం వల్ల పిల్లలు ఎక్కువ సార్లు తినడం, పదేపదే స్నాక్స్ తింటూ ఉండడం, జంక్ ఫుడ్ కు అలవాటవ్వడం వల్ల పిల్లలకు లేనిపోని సమస్యలొస్తున్నాయి.

ఏం చేయాలి?
పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వారిపై కాస్త శ్రద్ధ ఉంచడం అవసరం. పిల్లలు ఏం తింటున్నారు? ఎంత తింటున్నారు? వ్యాయామం ఉంటుందా లేదా అనేవి గమనిస్తూ ఉండాలి. పిల్లలకు పోషకాహారం మాత్రమే పెట్టాలి. అది కూడా ఒక టైం టేబుల్ ప్రకారం ఉండాలి. అలాగే పిల్లలతో ప్రతిరోజు వ్యాయామాలు చేయించటం, సాయంత్రం సమయంలో ఆటలు ఆడించటం వంటివి చేయాలి. రోజూ చెమట పట్టేలా ఆటలు, వ్యాయామాలు చేయించడం ద్వారా పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది. అలాగే ఖాళీ సమయాల్లో ఏదో ఒకటి తింటూ ఉండే అలవాటుని పిల్లల చేత మాన్పించాలి. చిన్న వయసులోనే పిల్లలకు ఊబకాయం వస్తుందంటే దానికి తల్లిదండ్రులే బాధ్యత. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో పేరెంట్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.