తెలంగాణలో ఈటల సంచలనం..

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెద్ద కుదుపు. గత కొన్ని నెలలుగా తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కి పొమ్మనకుండానే టీఆర్ఎస్ లో పొగపెడుతున్నారనే వార్తలు ప్రముఖంగా వినిపించాయి. వాటికి బలం చేకూరేట్లు తాజాగా వరుస సంఘటనలు జరిగాయి. మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం, బాధితులు నేరుగా సీఎం కేసీఆర్ కి లేఖ రాయడం, ఆయన వెంటనే విచారణకు ఆదేశించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈటల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలన్నీ టీఆర్ఎస్ అనుకూల మీడియాలో ప్రముఖంగా రావడం విశేషం.

అసలేం జరిగింది..?
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన కొందరు రైతులు ఇటీవల సీఎం కేసీఆర్ కు ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. 1994లో ప్రభుత్వం సర్వే నెంబర్ 130/5, 130/9, 130/10 లలో ఒక్కో కుటుంబానికీ 1 ఎకరం 20 కుంటల చొప్పున, సర్వే నెంబర్ 64/6 లో మూడు ఎకరాలు ఒకరికి కేటాయించినట్టు వారు లేఖలో తెలిపారు. ఇటీవల ఈ భూముల సమీపంలో మంత్రి ఈటల రాజేందర్ కోళ్లఫారంలు ఏర్పాటు చేయాలనుకున్నారని, దీంతో సదరు అసైన్డ్ భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారనేది ప్రధాన ఆరోపణ. జమున హేచరీస్ పేరుతో ఇప్పటికే అక్కడ 100 ఎకరాల అసైన్డ్ భూమిని ఈటల అనుచరులు ఆక్రమించారని, అక్కడ పౌల్ట్రీకి సంబంధించి నిర్మాణాలు జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అసైన్డ్ రైతులను బెదిరించి భూములు లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

ఈ నేపధ్యంలో మంత్రి ఈటల రాజేందర్‌ పై వస్తున్న ఆరోపణలపై అప్పటి అధికారి ధర్మారెడ్డి స్పందించినట్టు కూడా వార్తలొస్తున్నాయి. అప్పట్లో మంత్రి తనను అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారని, అయితే అది సాధ్యం కాదని ధర్మారెడ్డి చెప్పినట్టు వార్తలు బయటికొచ్చాయి. అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి నగేష్ కూడా ఈ వ్యవహారంలో ఈటలకు అనుకూలంగా వ్యవహరించలేదని, దీంతో మంత్రి అధికారులపై ఒత్తిడి పెంచారని అంటున్నారు. ఈ సంగతి పక్కనపెడితే.. ఈటల వ్యవహారంపై సీఎం కేసీఆర్ నేరుగా దృష్టిసారించడం ఇక్కడ కొసమెరుపు.

సమగ్ర దర్యాప్తుకి కేసీఆర్ ఆదేశం..
మంత్రి ఈటలపై వచ్చిన ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావు ని కూడా సీఎం ఆదేశించారు. సత్వరమే ప్రాథమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం ఆదేశాలిచ్చారు. ఈటల వ్యవహారంలో చకచకా జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.