పరీక్షలపై పునరాలోచించాలన్న ఏపీ హైకోర్టు..

ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. పరీక్షలు రద్దు చేయడం, లేదా వాయిదా వేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. పరీక్షల అంశంపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.

దాదాపు 30 లక్షల మందికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షల ప్రక్రియలో భాగస్వాములవుతారని.. కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని విచారణలో భాగంగా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం నిబంధనల ప్రకారం కోవిడ్ సోకినవారు ఐసోలేషన్‌ లేదా ఆస్పత్రిలో ఉండాలి అని న్యాయస్థానం పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని.. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేశాయని న్యాయస్థానం గుర్తుచేస్తూ.. పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది. ఈ అంశంపై మే3లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.

మరోవైపు నాడు-నేడు పనులపై అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పరీక్షల నిర్వహణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏ పరిస్థితులలో, ఎందుకు పరీక్షలు పెడుతున్నామనే విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేరళలో తాజాగా 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారని, పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదని, ఆ అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసిందనే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.

పరీక్షలు పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్‌ మార్కులు మాత్రమే ఇస్తున్నాయని, పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయని, మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయని, సీఎం జగన్ అధికారులకు చెప్పారు. కేవలం పాస్‌ మార్కులతో బయటపడిన విద్యార్థులకు 50 ఏళ్ల భవిష్యత్తు ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.

టీచర్లు పరిస్థితి అర్థం చేసుకోవాలి..
విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్‌ గుర్తించాలని అన్నారు సీఎం జగన్. అందరి సహాయ సహకారాలు, తోడ్పాటు కావాలన్న విషయాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు బలంగా చెప్పాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉందని ఆయన గుర్తు చేశారు. పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దని సూచించారు.