ప్రజా బాణమై వస్తున్నా.. బరాబర్ తెలంగాణలో నిలబడతా..

“ఎవరు అవునన్నా, కాదన్నా.. ఎవరికి ఇష్టం ఉన్నా, లేకున్నా.. నేను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే. ఈ గడ్డ మీద పెరిగా, చదువుకున్నా. బరాబర్‌ తెలంగాణలో నిలబడతా.. ప్రజల కోసం కొట్లాడుతా..” అని ఖమ్మం బహిరంగ సభలో స్పష్టం చేశారు షర్మిల. పార్టీ పెడుతున్నానని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకూ హైదరాబాద్ లోని తన నివాసం లోటస్ పాండ్ లోనే నేతలతో మంతనాలు జరిగిన షర్మిల, తొలిసారి ఖమ్మం బహిరంగ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లి విజయమ్మ వెంటరాగా.. లోటస్ పాండ్ నుంచి భారీ వాహన శ్రేణితో బలప్రదర్శన చేపట్టిన ఆమె, తెలంగాణలో తాను ఏ పార్టీకి అనుకూలం కాదని మరోసారి స్పష్టం చేశారు.

“సింహం ఒంటరిగా వస్తుంది. టీఆర్ఎస్ చెబితేనో, బీజేపీ అడిగితేనో, కాంగ్రెస్‌ పంపితేనో నేను రాలేదు. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజాబాణమై వస్తున్నా. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నా. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వస్తున్నా.. అందుకే పార్టీ పెడుతున్నా.” అని అన్నారు షర్మిల.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాచీని ధరించిన షర్మిల, పదే పదే తన హావభావాల్లో, మాటల్లో తండ్రిని గుర్తు చేశారు. వైఎస్ఆర్ జయంతి అయిన జూలై 8న కొత్త పార్టీ జెండా, అజెండా ప్రకటన చేస్తామని తెలిపారామె. తమది తెలంగాణ ప్రజల పార్టీ అని, ప్రజలకోసం నిలబడుతుందని అన్నారు.

టార్గెట్ కేసీఆర్..
తెలంగాణలో పార్టీ పెడతానంటూ లోటస్ పాండ్ లో మీటింగ్ పెట్టిన తొలిరోజే టీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెట్టిన షర్మిల, ఖమ్మం సభలో నేరుగా కేసీఆర్ ని టార్గెట్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే అవన్నీ కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం నలిగిపోతోందని, కేసీఆర్‌ దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పరిస్థితులు వచ్చాయని ధ్వజమెత్తారు.

ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారధ్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని తాను కూడా మొదట్లో భావించానని, కానీ అన్ని వర్గాలకు న్యాయం జరగలేదని, కల్వకుంట్ల కుటుంబానికి రాష్ట్రం బానిసైందని అన్నారు. కేసీఆర్ దయదలిచి ఇస్తే తీసుకోవాలని, ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా అపాయింట్ మెంట్లు లేవని, బాంచన్ అంటేనే టీఆర్ఎస్ లో భవిష్యత్తు ఉందని ఎద్దేవా చేశారు. తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తానన్న కేసీఆర్.. ఇప్పటి వరకూ చేసిన తప్పులకు ఎన్నిసార్లు ఆ పని చేయాలని ప్రశ్నించారు.
తాను తెలంగాణ కోసం నిలబడగలనా, పోరాడగలనా అనే సందేహాలు చాలామందిలో ఉండొచ్చని, రాష్ట్రానికి అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటానని, ప్రజల కోసం నిలబడి కొట్లాడతానని అన్నారు షర్మిల.

నిరాహార దీక్షలు చేస్తా..
రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, ప్రతి ఉద్యోగాన్నీ భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. నాలుగో రోజు నుంచి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు జిల్లాల్లో రిలేదీక్షలు చేస్తారని తెలిపారు. ఉద్యోగ ప్రకటన వచ్చే వరకు దీక్షలు జరుగుతాయని చెప్పారు.

నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా
“ఇకపై షర్మిల నా బిడ్డ కాదు, మీ బిడ్డ.. ఆశీర్వదించండి” అంటూ సంకల్ప సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ ప్రజలను కోరారు. తెలంగాణ సమస్యలపై షర్మిల అధ్యయనం చేస్తుందని, బతుకులు తెలుసుకుంటుందని, ఈ గడ్డపై, ప్రజలపై మమకారం నింపుకొని మేలు చేయాలని నా బిడ్డ అడుగులు వేస్తోందని చెప్పారామె. ఈ ప్రస్థానం కఠినమైనదైనా, దాన్ని ఎదిరించే గుణం, వైఎస్ రక్తం.. ఆమెలో ఉందని చెప్పారు. రాజశేఖర్ ‌రెడ్డి భార్యగా, షర్మిలకు అమ్మగా ఆమెను దీవించండి అని అడగడానికి వచ్చానని చెప్పారు విజయమ్మ.