సాగర్ వద్దు.. తిరుపతే ముద్దు..

ఏపీలో తిరుపతి లోక్ సభ స్థానానికి, అదే సమయంలో తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు చోట్లా గతంలో అధికార పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఈ దఫా కూడా అధికార పార్టీకే మొగ్గు ఉందని సర్వేలు చెబుతున్నాయి. తిరుపతిలో రెండో స్థానం కోసం బీజేపీ, టీడీపీ పోటీ పడుతున్నాయంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నా, బీజేపీ వెనకపడిపోయిందనే అభిప్రాయం కూడా ఉంది. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీజేపీ నుంచి టీఆర్ఎస్ కి వలసలు ఊపందుకున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డవారిని టీఆర్ఎస్ ఆకర్షించింది. కీలక నేతలు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో కార్యకర్తల్లో కూడా నైరాశ్యం నెలకొని ఉంది. దీంతో పార్టీ పెద్దలు కూడా పెద్దగా సాగర్ పై ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు సైతం తిరుపతిలో ప్రచారానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో తెలంగాణ బీజేపీలో ఆత్మవిశ్వాసం తొణకిసలాడినా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ దెబ్బ చవిచూడాల్సి వచ్చింది. సాగర్ లో కూడా బీజేపీ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతుందని అంచనా వేశారు. కానీ అభ్యర్థి ప్రకటన తర్వాత సమీకరణాలు మారిపోయాయి. టీఆర్ఎస్ వేచి చూసి మరీ తెలివిగా నోముల నర్సింహయ్య కొడుకు భగత్ కి టికెట్ ఇవ్వగా.. బీజేపీ మాత్రం ఎవరూ ఊహించని విధంగా డాక్టర్ రవికుమార్ పేరుని ఖరారు చేసింది. రాజకీయ నేపథ్యం పెద్దగా లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్. ఇక బీజేపీ వర్గాలు కూడా ఆ పోటీని టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మాత్రమే చూస్తున్నాయి. దీంతో అక్కడి ఫోకస్ కూడా తిరుపతిపై పడింది. ఇప్పటికే తిరుపతిలో బీజేపీ ప్రచార పర్వం జోరందుకుంది. పవన్ కల్యాణ్ తో కూడా ప్రచారం చేయించి కార్యకర్తల్లో ఊపు తెప్పించారు. తెలంగాణ నేతలు సైతం తిరుపతిలో పర్యటిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఖరారైంది. మరికొంతమంది కీలక నేతలు సైతం తిరుపతిలోనే మకాం వేస్తారని అంటున్నారు.
మొత్తమ్మీద ఒకేసారి రెండుచోట్లా ఎన్నికలు జరుగుతున్నా.. సాగర్ కంటే తిరుపతిపైనే బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టిందనే మాట మాత్రం వాస్తవం.