బీజాపూర్ మారణకాండ.. ఇంకా దొరకని జవాన్ల ఆచూకీ..

ఇటీవల కాలంలో మావోయిస్ట్ లు జరిపిన అతిపెద్ద దాడిగా ఛ‌త్తీస్‌ఘ‌డ్‌ బీజాపూర్ మారణకాండను అభివర్ణిస్తున్నారు. 2010లో సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుని పేల్చి 76మందిన పొట్టనపెట్టుకున్న మావోయిస్ట్ లు, గతేడాది మార్చిలో సుక్మా జిల్లాలోని మినప ప్రాంతంలో 17మంది పోలీసుల్ని అంతమొందించారు. ఆ తర్వాత చెదురుమదురు ఘటనలు మినహా.. ఇంత ఘోరం జరగలేదు. ఈ సారి ఏకంగా 22మంది భద్రతా సిబ్బంది మృత్యువాత పడటం, మరింతమంది ఆచూకీ కనిపించకపోవడం దురదృష్టకరం.

శనివారం సాయంత్రం జరిగిన ఈ యుద్ధకాండలో.. మృతిచెందిన భద్రతా సిబ్బంది సంఖ్య 22కి చేరింది. మరికొంతమంది ఆచూకీ గల్లంతైంది. వీరికోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అటు మావోయిస్ట్ వర్గానికి కూడా భారీ నష్టం జరిగిందని అంచనా. 10నుంచి 12మంది మావోయిస్ట్ లు మృతిచెంది ఉంటారని, 18మంది వరకు గాయపడి ఉంటారని చెబుతున్నారు.

హిడ్మా ఆధ్వర్యంలో
పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పి.ఎల్.జి.ఎ.) బెటాలియన్ ‌కు చెందిన దాదాపు 400 మంది మావోయిస్టులు అగ్రనేత హిడ్మా ఆధ్వర్యంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మహిళా మావోయిస్ట్ సుజాత ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్నారు. ఉద్యమంలో దీనిని ఓ గొప్ప విజయంగా మావోయిస్టులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల క్రితమే ఇంటెలిజెన్స్‌ వర్గాలకు హిడ్మా కదలికలపై సమాచారం వచ్చింది. దీంతో బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో శుక్రవారం రాత్రి నుంచి 2వేల మందితో కూంబింగ్‌ ప్రారంభించారు. టెర్రాం ప్రాంతంలో 760 మంది జవాన్లు కూంబింగ్‌ లో పాల్గొన్నారు. కూంబింగ్ జరిపి తిరిగి వెళ్తుండగా ఒక్కసారిగా వారిపై మావోయిస్ట్ లు విరుచుకుపడ్డారు. హిడ్మానే తన గురించి ఇన్ఫార్మర్ల ద్వారా లీకులు ఇప్పించి, ఈ దాడికి వ్యూహరచన చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

డైరెక్ట్ అటాక్..
సహజంగా మందుపాతరలు, గ్రనేడ్లతో భద్రతా దళాలపై మావోయిస్ట్ లు దాడులు చేస్తుంటారు. అయితే ఈ దఫా నేరుగా బుల్లెట్లతో విరుచుకుపడ్డారు. దాదాపు 3గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మూడువైపులనుంచి భద్రతా సిబ్బందిని ముట్టడించి మరీ తమ ఆపరేషన్ ని అమలు చేశారు మావోయిస్ట్ లు. దగ్గరలోని గ్రామాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకుని.. అక్కడికి వచ్చిన జవాన్లను కాల్చి చంపారు, మరికొందరిని నరికి చంపినట్టు తెలుస్తోంది. గాయపడిన జవాన్లను హెలికాప్టర్లలో రాయపూర్‌, బీజాపూర్‌ ఆస్పత్రులకు తరలించారు.

ప్రతీకారం తీర్చుకుంటాం..
భద్రత బలగాలపై మావోయిస్టుల దాడికి తగిన సమయంలో తగిన రీతిలో బదులిచ్చి, ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ ‌షా స్పష్టం చేశారు. అసోం ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకున్న ఆయన.. సీఆర్పీఎఫ్ చీఫ్ తో పరిస్థితిని సమీక్షించారు. భద్రత బలగాలను బలి తీసుకోవడాన్ని, రక్త తర్పణాన్ని సహించేది లేదన్నారు అమిత్ షా.