దీదీ దూకుడు.. 291మంది అభ్యర్థులు ఖరారు..

పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో బీజేపీని మట్టి కరిపించేందుకు ఎత్తులు వేస్తున్న మమతా బెనర్జీ.. 294 నియోజకవర్గాలకు గాను 291 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. తొలి జాబితా, మలి జాబితా, తుది జాబితా అంటూ నాన్చుడు ధోరణి పెట్టుకోలేదు. బీజేపీవైపు చూస్తున్నవారిని పక్కనపెట్టి, సిట్టింగ్ ల విషయంలో మరీ ఎక్కువగా ప్రయోగాలు చేయకుండానే దీదీ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. 80 సంవత్సరాలు దాటిన వారికి అవకాశం ఇవ్వలేదు. వారి స్థానంలో కొత్త ముఖాలను బరిలో దింపారు. మమత జాబితాలో 50 మంది మహిళలకు చోటు దక్కింది. ముస్లిం మైనార్టీలకు 42, ఎస్సీలకు 79, ఎస్టీలకు 17 సీట్లు కేటాయించారు మమత. ఇటీవలే దీదీ జట్టులో చేరిన క్రికెటర్ మనోజ్ తివారీకి టికెట్ దక్కింది. సినీ నటులు సయంతిక, కంచన్ మలిక్ కి కూడా టికెట్లు లభించాయి.

నందిగ్రామ్ మే సవాల్..
మమత్ బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్ ని వదిలేసి నందిగ్రామ్ ని ఎంపిక చేసుకున్నారు. దీని వెనక ఆమె ప్రతీకార వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు టీఎంసీలో నెంబర్-2 గా ఉన్న సువేందు అధికారి, ఇటీవలే పార్టీ ఫిరాయించారు. మమత కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా నందిగ్రామ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన, పార్టీ మారినా సొంత నియోజకవర్గం నుంచే బరిలో దిగుతానని గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సువేందుపై ప్రతీకారం తీర్చుకునేందుకే మమత తన నియోజకవర్గం మార్చారు. నందిగ్రామ్ లో ఈనెల 10న నామినేషన్ వేస్తానంటున్నారు. భవానీపూర్ ను సోబన్ దేవ్ చటర్జీకి కేటాయించారు.

దీదీ రెండు స్థానాలనుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అది అవాస్తవమేనని తేలిపోయింది. ఇక మిగిలిన మూడు సీట్లను మిత్రపక్షాలకు కేటాయిస్తామని చెప్పారు మమత. బయటి రాష్ట్రాలకు చెందిన నేతలు.. తేజస్వీయాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే దీదీకి మద్దతు తెలిపారు.
బెంగాల్‌ లో మొత్తం ఎనిమిది విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నెల 27న తొలి విడత ఎన్నికలు ప్రారంభం అవుతాయి, 29న ఎనిమిదో దశ ఎన్నికలు జరుగుతాయి. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.