తమిళనాడులో డీఎంకే గెలుపు.. తేల్చిచెప్పిన ఏబీపీ సీ వోటర్​ సర్వే..!

త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే గెలుపొందడం ఖాయమని ఏబీపీ సీ వోటర్​ సర్వే తేల్చిచెప్పింది. ఈ సారి ఎన్నికల్లో అధికార అన్నా డీఎంకే భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

తమిళనాడులో అన్నా డీఎంకే.. డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకోసారి మారుతూ ఉంటాయి. అయితే గత ఎన్నికల్లో పాత రికార్డులకు భిన్నంగా అన్నాడీఎంకే రెండో సారి అధికారం చేపట్టింది. అయితే కొంతకాలానికే జయ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె స్నేహితురాలు శశికళ పార్టీని చేజిక్కుంచుకోవాలని ప్రయత్నించినా ఆమె ఆటలు సాగలేదు. అవినీతి ఆరోపణలతో ఆమె జైలుకు వెళ్లారు. ఆ తర్వాత పళనిస్వామి సీఎం కుర్చీపై కూర్చున్నారు. అయితే పళనిస్వామికి బీజేపీ అండగా నిలిచింది. దీంతో ఆయన ఇంతకాలం ఆ సీటుమీద కూర్చోగలిగారు. నిజానికి తమిళ ప్రజలు భిన్నంగా వ్యవహరిస్తారు. వాళ్లకు ప్రాంతీయ​ అభిమానం, భాషాభిమానం ఎక్కువ. ప్రతి ఎన్నికల్లోనూ సంప్రదాయ ప్రాంతీయపార్టీలనే వాళ్లు గెలిపిస్తుంటారు.

అయితే ప్రస్తుతం అక్కడ అన్నాడీఎంకే ప్రభుత్వం.. కేంద్రలోని బీజేపీ చెప్పు చేతల్లో ఉండటం తమిళ ప్రజలకు నచ్చడం లేదట. దీంతో వాళ్లు స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే పార్టీకి అధికారం కట్టబెట్టాలని చూస్తున్నారట. మరోవైపు శశికళ మేనల్లుడు దినకరన్​ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) కూడా అన్నాడీఎంకే ఓటుబ్యాంక్​ను దెబ్బతీస్తుందని సర్వేలో వెల్లడైంది.

మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో అసెంబ్లీకి ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూటమిగా ఉన్న యూపీఏకు గరిష్టంగా 162 సీట్లు దక్కుతాయని, అన్నా డీఎంకే, బీజేపీ కూటమిగా ఉన్న ఎన్డీఏకు ఎక్కువలో ఎక్కువ 98 సీట్లు దక్కొచ్చని వెల్లడైంది.

మరోవైపు కమల్​హాసన్​ స్థాపించిన మక్కల్​ నీది మయ్యం పార్టీ కూడా పెద్దగా ప్రభావం చూపించకపోచ్చని సర్వేలో వెల్లడైంది. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే(అప్పుడు ఎన్డీఏలో లేదు) 136 సీట్లు, డీఎంకే(యూపీకే కూటమిగానే) 97 సీట్లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అన్నాడీఎంకే ​- బీజేపీ కూటమి భారీగా నష్టపోనున్నట్టు సమాచారం. స్టాలిన్​ సీఎంగా పదవి చేపట్టబోతున్నారంటూ ఈ సర్వే తేల్చిచెప్పింది.