బీజేపీతో కలిసి ఉన్నా… ఎవరి దారి వారిదే…

బీజేపీతో జనసేన పొత్తుపెట్టుకున్న తర్వాత రెండు పార్టీల నాయకులు ఏపీలో ఏ పని చేసినా.. అందరం కలిసే చేస్తామని పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ఏ నిరసనలో అయినా రెండు జెండాలు రెపరెపలాడాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.

అయితే ఆ రెండు పార్టీల సామరస్యం అనుకున్నంత సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా కేంద్ర నాయకత్వంతో ఉన్నంత కలివిడిగా రాష్ట్ర నాయకత్వంతో కలవలేకపోతున్నారు పవన్ కల్యాణ్. జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో కూడా చివరి నిమిషంలో అపోహలు తొలగించుకున్నామని చెప్పిన పవన్, ఇకపై తమ ప్రయాణమంతా కలిసే జరుగుతుందని చెప్పారు. అయినా ఫలితం లేదు.

ఇటీవల ఏపీలో రహదారుల సమస్యపై బీజేపీ ఒంటరిగానే నిరసన కార్యక్రమాలు చేపట్టింది, ఇప్పుడు రైతుల తరపున జనసేన తలపెట్టిన ఆందోళనలు కూడా పూర్తిగా ఆ పార్టీకే పరిమితం. ఈ రెండు కార్యక్రమాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసేవే అయినా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నాయి బీజేపీ, జనసేన. స్నేహంకోసం చేతులు కలిపినంత సులభంగా రెండు పార్టీల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడలేదనేది కాదనలేని వాస్తవం.

పవన్ తనని తాను ఎక్కువగా ఊహించుకోవడమో లేక.. వరుస విజయాలతో బీజేపీలోలో ఉత్సాహం పెరగడమో.. కారణం ఏదయినా ఏపీలో మాత్రం బీజేపీ, జనసేన జర్నీ సాఫీగా సాగడంలేదు. నాయకులు అప్పుడప్పుడు సమీక్షలు పెట్టుకుంటున్నారు కానీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు కలసి పనిచేసిందే లేదు.

ఈ వ్యవహారం ఇలాగే ఉంటే 2024 ఎన్నికలయినా, ఒకవేళ ముందస్తుగా వచ్చే జమిలి ఎన్నికలయినా బీజేపీ, జనసేన ఉమ్మడి పోటీని ఊహించలేం. అంతెందుకు.. ఉప ఎన్నిక జరగబోతున్న తిరుపతి సీటుకోసం రెండు పార్టీలు తెగేదాకా లాగేలా కనిపిస్తున్నాయి. బీజేపీ, జనసేన కాపురం ఎలా ఉంటుందో.. తిరుపతి ఎన్నికతో ఓ క్లారిటీ వచ్చేస్తుంది.