రాములమ్మ లాంఛనం పూర్తి…

కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా ఉన్న విజయశాంతి.. బీజేపీలో చేరతారనే ప్రచారం చాన్నాళ్లనుంచి జోరుగా సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలకు ముందే ఆమె బీజేపీలో చేరాల్సింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాషాయ కండువా కప్పుకుంటారని అన్నారు. అమిత్ షా హైదరాబాద్ కి వచ్చిన సందర్భంలో విజయశాంతి బీజేపీలో చేరతారని, గ్రేటర్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తారని పుకార్లు వచ్చాయి.

అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చినా ఇంకా ఆమెవైపు నుంచి అధికార ప్రకటన వెలువడకపోవడం కాస్త సస్పెన్స్ ని క్రియేట్ చేసింది. అయితే ఆ సస్పెన్స్ కి తెరదించుతూ రాములమ్మ హస్తినలో ప్రత్యక్షమైంది. అమిత్ షా ని కలిసిన తర్వాత రేపు అధికారికంగా రాములమ్మ సొంత ఇంటికి వెళ్లిపోతుంది.

విజయశాంతి రాజకీయ ప్రస్థానం బీజేపీతోనే మొదలైంది. తమిళనాట రాజకీయ ఓనమాలు నేర్చుకుని.. తెలంగాణలో ఏకంగా తల్లి తెలంగాణ అనే సొంత పార్టీ పెట్టింది విజయశాంతి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితితో కలసి, కేసీఆర్ తో కలసి ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడింది, ఎంపీగా పార్లమెంట్ లో తన గళం వినిపించింది. కేసీఆర్ తో వచ్చివ విభేదాలతో బైటకొచ్చిన విజయశాంతి, సరిగ్గా రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ లో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేసి ఓడిపోయింది.

ఆ తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయానికి స్టార్ క్యాంపెయినర్ గా దూసుకొచ్చింది విజయశాంతి. ప్రత్యక్ష రాజకీయ బరిలో దిగకపోయినా కాంగ్రెస్ పార్టీ ఆమెకు మంచి గుర్తింపునే ఇచ్చింది.

తాజాగా పార్టీలోని అంతర్గత రాజకీయాలతో విసిగిపోయిన విజయశాంతి తిరిగి ఇన్నాళ్లకు సొంత గూటికి రాబోతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతోంది. దుబ్బాక విజయం, ఆ తర్వాత జీహెచ్ఎంసీలో గణనీయ సీట్లు గెలుచుకుని కాషాయదళం మంచి ఊపుమీదుంది. ఈ దశలో విజయశాంతి చేరిక కచ్చితంగా ఆ పార్టీకి మరింత క్రేజ్ తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.