జూమ్ మీటింగులో… ఎలా కనబడుతున్నామో !

మనతోపాటు పనిచేసే కొలీగ్ ఇప్పుడు మన పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా హాయిగా కలిసిమెలసి పనిచేయగలుగుతున్న కాలం ఇది. కరోనా కారణంగా వర్చువల్ ప్లాట్ ఫామ్ లే పనివేదికలుగా మారిపోతున్నాయి. మూడు వీడియో కాల్స్, ఆరు జూమ్ మీటింగులుగా బతికేస్తున్నాం.  అయితే ఇంట్లోంచి బయటకు కదలకుండా పనిచేసుకోవటం బాగానే ఉంటుంది కానీ… దీనివలన కొన్ని ఇబ్బందులు సైతం ఉన్నాయి.

తరచుగా వీడియోల్లో స్క్రీన్లపైన కనిపించాల్సి వచ్చినప్పుడు మనం ఎలా కనబడుతున్నాం… అందంగానే కనబడుతున్నామా లేదా… అనే సందేహం కలగటం సహజం. మహిళల్లో ఈ అనుమానం మరికాస్త ఎక్కువే ఉంటుంది. అన్నివేళలా అన్ని కోణాల్లో అందంగానే కనిపించడం ఎవరికైనా అసాధ్యమే. అందుకే అలాంటి తాపత్రయం ఉంటుంది.  ఇప్పుడు ఇదొక కొత్త సమస్యగా తెరమీదకు వచ్చింది.

తాము ఫోన్లు, లాప్ టాప్ లు వంటి వాటిలో అందంగా కనబడటం లేదేమో… అనే బాధ   చాలామందిని వేధిస్తోంది. దీనిని జూమ్ డిస్మార్ఫియాగా నిపుణులు చెబుతున్నారు. తమ శరీరంలో ఏదో ఒక అవయవం అసాధరణంగా (బాగానే ఉన్నప్పటికీ) ఉందనే అనుమానంతో ఉండటాన్ని డిస్మార్ఫియా అంటారు. ‘ ఫేసియల్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఈస్తటిక్ మెడిసిన్ ’ అనే పత్రికలో ఈ విషయంపైన ఈ రంగానికి చెందిన నిపుణులు కలిసి ఓ వ్యాసం రాశారు.

ప్లాస్టిక్ సర్జరీ, సౌందర్య చికిత్సలకోసం వైద్యులను కలుస్తున్నవారు పెరుగుతున్నారని, ముఖ్యంగా చాలామంది మొహంపైన మొటిమలు, ముడతల చికిత్సకోసం వస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. కరోనా పీడిత కాలంలో గూగుల్ లో ఎక్కువమంది సెర్చ్ చేసిన విషయాలు కూడా ఇవే… మొటిమలు, జుట్టు ఊడటం గురించి.

తరచుగా వీడియోల్లో తమని తాము చూసుకునేవారిలో … తాము ఎలా కనబడుతున్నాం… అనే  ఆందోళన ఉంటోందని, దాంతో వారు ఆ విషయంపై మరింత శ్రద్ధని పెడుతున్నారని అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పటల్ కి చెందిన డాక్టర్ అరియన్నె షాడీ కౌరొష్ అన్నారు. ‘ ఫేసియల్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఈస్తటిక్ మెడిసిన్ ’ లో జూమ్ డిస్మార్ఫియా పై వ్యాసం రాసినవారిలో అరియన్నే కూడా ఉన్నారు.

జూమ్ రాక ముందునుండే ఇంటర్ నెట్ లో సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను పోస్ట్ చేసేవారు… వాటిని ఫొటో ఎడిటింగ్ యాప్ ల ద్వారా అందంగా మార్చేసి ఆపై పోస్ట్ చేయటం జరుగుతోంది. జూమ్ లో అలా మార్చుకునే అవకాశం లేకపోవటం వలన చాలామంది తాము కనబడే విధానం పట్ల అయిష్టంగా ఉంటున్నారు. పైగా వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నపుడు.. నేరుగా మాట్లాడుతున్నప్పటికంటే ఎదుటివారి మొహంలోని భావోద్వేగాలను మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది.

అయితే వెబ్ కామ్ లో కనిపించేటప్పుడు మొహాలు కాస్త పొట్టిగా మరింత గుండ్రంగా, కళ్లు ముక్కు వెడల్పుగా కనబడతాయని దానిని వాస్తవంగా భావించకూడదని ఈ విషయంపై పరిశోధనలు చేసినవారు సలహా ఇస్తున్నారు.

అలాగే… మొహంపైన ముడతలకు ట్రీట్ మెంట్ తీసుకుంటే… తాము ఇతరులకు సంతోషంగా ఉన్నట్టుగా కనబడుతున్నామనే ఆనందం ఉంటుందని… దానివలన తమ పట్ల తాము మంచి ఫీలింగ్స్ తో ఉండే అవకాశం ఉందని కూడా పరిశోధకులు అంటున్నారు. అయితే తమ మొహంపైన ముడతలను చూసుకుని… తమలో  ఆనందంగా ఉండే శక్తి లేదని భావిస్తే మాత్రం… ఆ నెగెటివ్ ఫీలింగ్స్ మరింతగా పెరిగి డిప్రెషన్ కి దారితీసే అవకాశం సైతం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.