రాజీవ్ గాంధీ మనుమడు రాజీవ్ వాద్రా… మంచి ఫొటోగ్రాఫర్ !

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా…  ఈ కుటుంబంలో ఎవరి పేరు విన్నా మనకు రాజకీయాలే గుర్తుకువస్తాయి. అయితే ఈ కుటుంబానికే చెందిన రైహాన్ రాజీవ్ వాద్రా మాత్రం… రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా వార్తల్లోకి వస్తున్నాడు. ఇరవైఏళ్ల రాజీవ్ వాద్రా ప్రియాంకా గాంధీ కుమారుడు. అబ్బుర పరిచేలా ఫొటోగ్రఫీలో రాణిస్తున్న అమెచ్యూర్ ఫొటోగ్రాఫర్ ఇతను.

రాజస్థాన్ వైల్డ్ లైఫ్ రిజర్వులోని రంతమ్ బోర్ నేషనల్ పార్క్ లో తాను తీసిన  పులుల ఫొటోలను రాజీవ్ వాద్రా…  ట్విట్టర్లో, ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నెటిజన్లు లైకులు కామెంట్లతో ఈ యువ ఫొటోగ్రాఫర్ ని అభినందించారు. నిజంగానే ఆ ఫొటోలు చూపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి. చెట్ల మధ్యనుండి తీక్షణంగా చూస్తున్న పులి కన్ను ఫొటో…  ఫొటోగ్రఫీ పట్ల రాజీవ్ కున్న ఆసక్తి, నైపుణ్యం తెలియజేసేలా ఉంది. నెటిజన్లు ‘అద్భుతమైన ఫొటోగ్రఫీ’ అంటూ దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టి- 101 అనే పులి కనబడుతున్న ఈ ఫొటోని నేషనల్ పార్క్ లోని ఆరో జోన్ లో అక్టోబరు ఆరున తీశానని రైహాన్ రాజీవ్ వాద్రా తెలిపాడు.

ఇతనికి అడవులంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. సెప్టెంబరు 26న వాద్రా… ఎనిమిది నెలల తరువాత తిరిగి అడవులకు వెళుతున్నాను… అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతవారం… తాను రంతమ్ బోర్ నేషనల్ పార్క్ కి వెళుతున్నట్టుగా తెలిపాడు. ఈ ప్రాంతాన్ని తన ఫేవరేట్ ప్లేస్ గా రాజీవ్ వాద్రా పేర్కొన్నాడు.  అక్కడికి వెళ్లినప్పటినుండి తాను తీసిన పలు ఫొటోలను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. అవన్నీ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జూన్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రియాంకా గాంధీ తన కుమారుడు తీసిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పచ్చని పచ్చిక మధ్యలో నెమలి నిలబడి ఉన్న చిత్రం అది.

రైహాన్ రాజీవ్ వాద్రాకు రాజకీయాలకంటే ఫొటోగ్రఫీ అంటే ప్రేమ ఎక్కువగా ఉన్నట్టుంది అంటూ… ఇతనిపై మీడియాలో ఆర్టికల్స్ సైతం వస్తున్నాయి.