మల్లయోధుని కుమార్తె… మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లోకి ప్రవేశం !

అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా… నిజజీవిత కథనుండి ప్రభావితమై తీసినదని చాలామందికి తెలుసు. ప్రముఖ రెజ్లర్ మహవీర్ సింగ్ ఫొగట్ జీవితమే ఆ సినిమాకు ఆధారం. మహవీర్ కుమార్తె రీతూ ఫొగట్. ఈమెకూడా రెజ్లరే. కానీ ఇప్పుడు మిక్స్ డ్  మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ ఎమ్ ఎ) లో శిక్షణ తీసుకుని ఆ పోటీలకు సిద్ధమవుతోంది. ప్రతి మహిళా తప్పకుండా రోజుకి 30 నుండి 45 నిముషాలపాటు వ్యాయామం చేయాలని రీతు చెబుతోంది. ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ అయిన రీతు ఎమ్ ఎమ్ ఎ వైపు ఎందుకు వెళ్లింది… అందులో ఎలాంటి శిక్షణ తీసుకుంది. ఆమె ఆహారపు అలవాట్లు ఏంటి… మొదలైన ప్రశ్నలకు సమాధానాలు ఆమె మాటల్లోనే –

రెజ్లింగ్ నా జీవితంలోంచి విడదీయలేని అంశం. అయితే నాకు ఎమ్ ఎమ్ ఎ మీద కూడా చాలా ఆసక్తి ఉండేది. ఆ ఆటని చూసేదాన్ని కానీ… దాన్ని ఎలా ఆడాలో తెలిసేది కాదు. ఎక్కడ నేర్చుకోవాలో కూడా అర్థం కాలేదు. అలాగే   ఎమ్ ఎమ్ ఎలో ఇండియన్ వరల్డ్ ఛాంపియన్స్ ఎవరూ లేకపోవటం కూడా చాలా ఆశ్చర్యం కలిగించేది. తరువాత సింగపూర్ లోని ఇవాల్వ్ ఎమ్ ఎమ్ ఎలో శిక్షణ పొందే అవకాశం వచ్చింది. ఇది ఆసియాలోనే పేరున్న మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ అకాడమీ. మా నాన్న ఇతర కుటుంబ సభ్యులు స్నేహితులు నన్ను ఎమ్ ఎమ్ ఎ  విషయంలో ప్రోత్సహించారు.

ఎమ్ ఎమ్ ఎ చాలా అందమైన క్రీడ. ఒకటి కంటే ఎక్కువ క్రీడల పట్ల ఆసక్తి నైపుణ్యం ఉన్నవారికి ఇది చాలా బాగా సూటవుతుంది. వారానికి ఆరురోజుల శిక్షణతో పలుదేశాలకు సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాను. నా కోచ్ లు నాకు ఎన్నో నైపుణ్యాలు నేర్పించారు. నవంబరు 2019తో ఎమ్ ఎమ్ ఎ పోటీలకు వెళ్లేందుకు అర్హత సాధించాను.

ఫిట్ నెస్ విషయానికి వస్తే… అందరికీ ఇది అవసరమే. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజూ 35 నుండి 40 నిముషాలపాటు ఏదో ఒక వ్యాయామం చేయాలి. వ్యాయామంతో మనలోని శక్తిని పూర్తిగా సమర్ధవంతంగా వినియోగించుకోగలుగుతాం.  నా ఆహారం గురించి… భారత్ లోని ఇతర పైల్వాన్ లు ఎలాంటి ఆహారం తీసుకుంటారో అలాగే ఉంటుంది నా ఆహార విధానం. బాదంపప్పు, పాలు, నెయ్యి… ఇవి నా ప్రధాన ఆహారం. ఆరుగంటల శిక్షణ తరువాత , తగినంత ఆహారం, విశ్రాంతి… ఇవి తప్పకుండా ఉండేలా చూసుకుంటాను. ఎక్కడ ఉన్నా, ఏ పోటీల్లో ఉన్నా నెయ్యి ఉండాల్సిందే.

ప్రస్తుతం ‘ది అప్రెంటిస్… వన్ ఛాంపియన్ షిప్ ఎడిషన్’ అనే టీవీ రియాలిటీ షో లో పాల్గొంటున్నాను. ఇది వచ్చే ఏడాది ప్రసారమవుతుంది. ఇందులో న్యాయ నిర్ణేతలు… పోటీదారుల్లోని వ్యాపార నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇది బిజినెస్ ప్రపంచానికి సంబంధించిన షొ అయినప్పటికీ… దీనికి క్రీడలకు సంబంధం ఉంది. ఎందుకంటే  ఆటల్లో రాణించాలంటే అవసరమైన ఏకాగ్రత, అంకితభావం, టీమ్ వర్క్, పోటీతత్వం ఇవన్నీ వ్యాపారంలో కూడా ఉండాల్సిందే. ఈ షోలో భాగం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.