మాస్క్ తో మస్కా కొట్టాలనుకున్నాడు… కానీ…!

గోల్డ్ స్మగ్లింగ్ చేసేవారి ఆలోచనలు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంటాయి కదా. ఇలా కూడా బంగారాన్ని తీసుకురావచ్చా… అనేంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇప్పుడు స్మగ్లర్లకు కొత్తగా మరొక మార్గం దొరికింది. కోవిడ్ చూపిన దారి అది. నోటికి కట్టుకునే మాస్క్ లో బంగారం పెట్టుకుంటే ఎవరికీ కనిపించదనే ఐడియా వచ్చింది ఓ వ్యక్తికి. రెండు లక్షల విలువ చేసే నలభై గ్రాముల బంగారాన్ని తన కె ఎన్ 95 మాస్కు ద్వారా తెచ్చేసుకోవచ్చని అనుకున్నాడు. కానీ అతని కల మాత్రం నెరవేరలేదు.

కర్ణాటకకు చెందిన అమ్మార్… మాస్క్ లో నలభై గ్రాముల బంగారం పెట్టుకుని దుబాయ్ లో విమానం ఎక్కి మంగళవారం సాయంత్రం  కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగాడు.  చాలా తెలివిగా బంగారం తెచ్చేసుకున్నాను అనుకున్నాడు కానీ…  అక్కడ కస్టమ్స్ అధికారులు అతణ్ణి పట్టుకున్నారు. దాంతో అతని ఆశ నెరవేరకపోగా జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. పోలీసులు అమ్మార్ ని  అరెస్టు చేశారు.

మాస్క్ ద్వారా బంగారం తెచ్చుకోవచ్చనే ఆలోచనకు కస్టమ్స్ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చివరికి కోవిడ్ ని సైతం స్మగ్లింగ్ కోసం వాడుతున్నారంటూ, ఇప్పటి వరకు తాము ఇలాంటి వ్యవహారం చూడలేదన్నారు వారు.  ఈ మధ్యకాలంలో బంగారం స్మగ్లింగ్  మరింతగా పెరిగింది. సౌదీ అరేబియా నుండి వచ్చిన ఓ ప్రయాణీకుడు 12 లక్షల రూపాయల విలువ చేసే 250 గ్రాముల బంగారాన్ని ఇస్త్రీ పెట్టెలో పెట్టుకుని తెచ్చినట్టుగా తెలుస్తోంది.