స్కాం దర్యాప్తుపై స్టే ఇచ్చిన హైకోర్టుపై సుప్రీం అసంతృప్తి

అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది . కుంభకోణంపై విచారణ జరగకుండా హైకోర్టు స్టే ఇవ్వడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

తుళ్లూరు మండలంలోని ఎస్సీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను కొందరు టీడీపీ నేతలు వారిని తప్పుదోవ పట్టించి స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించదని… ఉచితంగా రాజధాని కోసం తీసుకుంటుందని వెనుకబడిన వర్గాలను కొందరు తప్పుదోవ పట్టించి తక్కువ ధరకు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇలా రాజధాని ప్రాంతంలో వేల ఎకరాల అసైన్డ్ భూములను కొందరు తక్కువ ధరకు చేజెక్కించుకున్నారని.. అలా భూములు తమ అధీనంలోకి వచ్చిన తర్వాత నాటి ప్రభుత్వంలో చక్రం తిప్పి ఆ భూములకు కూడా రాజధాని ప్యాకేజీలను తీసుకున్నారు. ఇందుకు తుళ్లూరు తహసీల్దార్‌గా పనిచేసిన అన్నే సుధీర్‌బాబు సహకరించారన్న అభియోగాలపై కేసు నమోదు అయింది. కేసు నమోదు కాగానే నిందితులు హైకోర్టుకు వెళ్లారు. తక్షణం హైకోర్టు కేసు దర్యాప్తుపై స్టే ఇచ్చింది.

దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కుంభకోణం చాలా పెద్దదని వేల ఎకరాలకు సంబంధించిన వ్యవహారమని ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. అసైన్డ్ భూములకు పరిహారం రాదని తప్పుదోవ పట్టించి వెనుకబడిన వర్గాలను, పేదలను వంచించారని ప్రభుత్వం వాదించింది.

అసలు తుళ్లూరు రాజధాని పరిధిలో లేదని నిందితుల తరపున న్యాయవాది వాదించారు. ఇందుకు స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు తుళ్లూరు రాజధాని పరిధిలోనే ఉందన్నారు.. అసలు దర్యాప్తు జరిగితే వచ్చే ఇబ్బంది ఏమిటని నిందితుల తరపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

ఇంత పెద్ద కుంభకోణంపై దర్యాప్తు జరుగుతుంటే ప్రాథమిక దశలోనే హైకోర్టు స్టే ఇవ్వడంపై తాము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దాంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. 22న జరిగే తదుపరి విచారణలో అసైన్డ్ భూముల కుంభకోణంపై తుది ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.