నటుడు జయప్రకాశ్‌ రెడ్డి కన్నుమూత

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. రాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో బాత్ రూంలో కుప్పకూలిపడిపోయారు. లాక్‌డౌన్ సమయం నుంచి ఆయన గుంటూరులో ఉంటున్నారు. జయప్రకాశ్‌ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల. ఆయన 1946 లో జన్మించారు. బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వారా చిత్రపరిశ్రమలో అడుగు పెట్టారు.

రాయలసీమ యాసలో జయప్రకాశ్‌రెడ్డి నటన ఆయన్ను ఓ స్థాయికి తీసుకెళ్లింది. సమరసింహారెడ్డి, ప్రేమించుకుందాం రా, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు చిత్రాల్లో ఆయన నటన విలనిజానికే కొత్త పంథాను తెచ్చింది. రాయలసీమ యాసలో విలనిజం పండించడంతో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. కరుడుగట్టిన విలన్ పాత్రల్లోనే కాకుండా కామెడీ పాత్రల్లోనూ అద్భుతంగా రాణించారు.